ఓడిపోతామా: 18 పరుగులకే 4వికెట్లు కోల్పోయిన టీమిండియా

టీమిండియా కివీస్ గడ్డపై తడబడుతోంది. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోతున్నారు. గురువారం జరిగిన 4వ వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్వని రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పేలవంగా వికెట్ చేజార్చుకున్నారు. మూడో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్, ధోనీలు కూడా చేతులెత్తేశారు. దీంతో.. 9.3 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 18/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.
నాలుగు వికెట్లు కోల్పోయిందిలా:
ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (2) క్లీన్ బౌల్డవగా.. ఆ తర్వాత ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ఆడిన ధావన్ (6) బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మాట్ హెన్రీ చేతికి చిక్కాడు. అనంతరం నిలకడగా ఆడినట్లు కనిపించిన శుభమన్ గిల్ (7) కూడా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఫెయిలైయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో పేలవ ఫుట్‌వర్క్ కారణంగా ఫీల్డర్ శాంట్నర్ చేతికి చిక్కాడు. ఈ దశలో జట్టుని ఆదుకుంటాడని ఆశించిన మాజీ కెప్టెన్ ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసి బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. నాలుగో వన్డేలో భారత్ 92 పరుగులకే ఆలౌటైన విషయం విదితమే.