Canal Breach : అయ్యయ్యో.. ఆ ఊరంతా నీరే.. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామం జలమయం..

వరద నీరు ఇళ్లను, పంట పొలాలను, రోడ్లను ముంచెత్తడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Canal Breach : అయ్యయ్యో.. ఆ ఊరంతా నీరే.. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామం జలమయం..

Updated On : January 12, 2025 / 6:16 PM IST

Canal Breach : కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామం జలమయమైంది. గ్రామం సమీపంలోని ఎస్ఆర్ఎస్ పీ కెనాల్ కు గండిపడటంతో ఊరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ వరద నీరు ఇళ్లను చుట్టుముట్టింది. రోడ్లపై నదిలా వరద నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు కాలువ ఉంది. ఈ కాలువ ద్వారా సాగు కోసం అధికారులు నీటిని వదిలారు. అయితే, ఎక్కువగా నీరు విడుదల చేయడంతో గండిపడి గ్రామంలోకి వరద నీరు చేరుతోంది.

గండి పడటంతో మన్నెంపలి గ్రామంలోకి పోటెత్తిన వరద నీరు..
తిమ్మాపూర్ మండలం మన్నెంపలి గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తింది. డీ-4 కెనాల్ కు గండి పడటంతో ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గ్రామాన్ని జలమయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రధాన రహదారులపైన కూడా వరద పోటెత్తడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Also Read : ఫార్ములా ఈ-కార్ రేసు, హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన..
గతంలోనూ ఇలానే వరద పోటెత్తిందని గ్రామస్తులు వాపోయారు. డీ-4 కెనాల్ నిర్వహణ లోపం కారణంగానే ఇప్పుడిలా గండి పడి ఈ వరద నీరు అంతా గ్రామంలోకి చేరుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో గండి..!
డీ4 కెనాల్ తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు ఉంటుంది. రైతులకు సాగునీరు అందించడం కోసం నీటిని విడుదల చేశారు. అయితే, పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో.. వీక్ పాయింట్ వద్ద పెద్ద గండి ఏర్పడింది. దాంతో వరద నీరు గ్రామంలోకి పోటెత్తింది. అధికారులు ఎవరూ స్పందించలేదని, నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.

మన్నెంపల్లిలోకి వరద నీరు చేరడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఫోన్ చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

 

Also Read : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట.. ఏకంగా మంత్రుల ముందే..