Telangana Four Schemes: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నాలుగు కొత్త పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana Four Schemes: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నాలుగు కొత్త పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : January 26, 2025 / 2:53 PM IST

Telangana Four Schemes: గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కొస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కొత్త పథకాలైన.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించారు. నాలుగు పథకాలను ఇవాళ 606 గ్రామాల్లో ప్రారంభించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రమంతటా అర్హులైన వారికి ఈ పథకాలను అందించనున్నారు.

Also Read: Rythu Bharosa: వీరి ఖాతాల్లోకే ‘రైతు భరోసా’ డబ్బులు.. అర్హత ఉండి నగదు రానివారు ఇలా చేయండి..

ఇందిరమ్మ ఇళ్ల పథకం..
ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం కింద మొద‌టి విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గ‌రిష్ఠంగా 4.50 ల‌క్ష‌ల ఇళ్ల‌ను ప్రభుత్వం మంజూరు చేయనుంది. తొలి దశలో ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్ర‌భుత్వం రూ.5ల‌క్ష‌లు ఇవ్వ‌నుంది. మొద‌టి విడ‌త‌లో స్థ‌లం ఉన్న‌వారికి ఇళ్లు మంజూరు చేయ‌నున్నారు. ఎంపికైన ల‌బ్ధిదారుల‌ బ్యాంక్ ఖాతాలకు ద‌శ‌ల వారీగా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయి. మొద‌ట‌గా బేస్‌మెంట్ స్థాయిలో రూ. ల‌క్ష‌, స్లాబ్‌ నిర్మాణం జ‌రిగే స‌మ‌యంలో రూ.ల‌క్ష‌, స్లాబ్ పూర్త‌యిన త‌రువాత రూ. రెండు ల‌క్ష‌లు, ఇంటి నిర్మాణం పూర్త‌య్యాక మ‌రో రూ.ల‌క్ష అందిస్తారు. ఈ మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే జ‌మ చేస్తారు.
అయితే, ఫిబ్రవరి మొదటి వారంలో మొదటి విడత లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది.

Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్ల‌య్‌ చేశారా..? ఫైనల్ లిస్ట్ ఎప్పుడు.. ఎలా చెక్‌చేసుకోవాలంటే..

రైతు భరోసా పథకం..
రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6వేల చొప్పున ‘రైతు భరోసా’ నిధులు జమ చేయనుంది. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమ కానున్నాయి. సాగుచేసే భూములకే రైతు భరోసా పథకం వర్తించనుంది. దీంతో దాదాపు 1.49కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆ పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును జమచేయనుంది.

 

కొత్త రేషన్ కార్డులు..
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే గ్రామ సభల ద్వారా అర్హత కలిగిన వారిని అధికారులు ఎంపిక చేశారు. వారికి నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అయితే, ఇంకా కొంత రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోనివారు.. దరఖాస్తు చేసుకోవాలని నింతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.

 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ప్రతీయేటా రెండు విడతల్లో రూ.12వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని ప్రభుత్వ అమలు చేస్తుంది. ఈ పథకాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో 20రోజులు పనిచేసిన వారిని ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. వారికి తొలి విడత నగదును అందజేయనున్నారు.