ఓరుగల్లు హస్తం నేతల అనుచరులకు ప్రొటోకాల్ టెన్షన్.. పార్టీ పదవులపై వీరి కన్ను

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయట.

ఓరుగల్లు హస్తం నేతల అనుచరులకు ప్రొటోకాల్ టెన్షన్.. పార్టీ పదవులపై వీరి కన్ను

Updated On : March 9, 2025 / 2:08 PM IST

ఓరుగల్లు కాంగ్రెస్‌ నేతలు పదవుల రేసులో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు..పార్టీలో పట్టుకోసం తమ బంధువులను పార్టీ పదవుల్లో కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నలుగురిలో తిరుగుదామంటే ప్రొటోకాల్ రగడ, క్యాడర్‌ను లైన్ అప్ చేద్దామంటే పార్టీలో ఏ పదవీ లేక అయోమయంలో ఉన్నారట ముఖ్యనేతల అనుచరులు.

త్వరలో డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందన్న ప్రచారంతో ప్రయత్నాలు షురూ చేశారట. నామినేటెడ్‌ పదవి ఎలాగో దక్కేలా లేదు..పార్టీ పదవులు అయినా దక్కించుకుందామని ఆరాట పడుతున్నారు నేతలు. ప్లీజ్..ప్లీజ్..ఒక్క చాన్స్ అంటూ జిల్లా మంత్రులు, MLAల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జనగామ డీసీసీ పీఠంపై ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ములుగు జిల్లా అధ్యక్ష పదవి రేసులో మంత్రి సీతక్క కుమారుడు సూర్య, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్ష రేసులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి ఎలాంటి పదవి లేకపోవడంతో నియోజకవర్గంలో ప్రొటోకాల్ సమస్య వస్తుందట.

సీతక్క కుమారుడు సూర్యకు ఇస్తారా?
ములుగు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం పైడాకుల అశోక్ ఉన్నారు. ఆయన జడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని తెగ ఆరాట పడుతున్నాడట. మంత్రి సీతక్కకు కూడా తన మదిలో మాట చెప్పేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధ్యక్ష పగ్గాలు సీతక్క కుమారుడు సూర్యకు ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఇక జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ప్రస్తుతం కొమ్మూరి ప్రతాపరెడ్డి కొనసాగుతున్నారు. వరస వైఫల్యాలు, పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అక్కడ బలమైన నేతకు డీసీసీ పగ్గాలు ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తుందట.

హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం..వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. 2010 నుంచి 14 సంవత్సరాల పాటు కంటిన్యూగా డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి పార్టీ పగ్గాలు వేరే వాళ్ల చేతిలో పెట్టాలని నాయిని కోరుతున్నారట. పనిలో పనిగా తన మదిలో ఉన్న రెండు పేర్లను అధిష్టానం పెద్దల చెవిలో వేశారట. ఇక వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ కొనసాగుతున్నారు. మంత్రి కొండా సురేఖతో సఖ్యత లేకపోవడంతో ఎర్రబెల్లి స్వర్ణను స్థానంలో మరొకరిని నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో అతడి స్థానంలో కొత్తవ్యక్తిని డీసీసీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది.

మార్పు కచ్చితంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భరత్ చంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక్కడ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, మహబూబాబాద్ MLA మురళీనాయక్ నిర్ణయం కీలకం కానుంది.

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయట. అందుకే కనీసం పార్టీ పదవులతోనైనా సర్దిపెట్టుకోవాలని భావిస్తున్నారట. ముఖ్యంగా డీసీసీ పీఠంపైనే ఎక్కువ మంది దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఓరుగల్లు కాంగ్రెస్ నేతల వారసులు, అనుచరుల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి మరి.