Harish Rao: కేరళ వెళ్లి అబద్ధాలు చెబుతున్నారు- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
నాలుగు రైతుబంధులు ఎగ్గొట్టారు. ఒక్కసారి మాత్రమే పూర్తిగా ఇచ్చారు. వనపర్తిలో ఏ ఊరికి అయినా వెళ్దాం. రుణమాఫీ వంద శాతం పూర్తయితే నేను రాజీనామా చేస్తా. కాకపోతే నువ్వు కూడా చేయాలి.
Harish Rao: వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులతో దీక్ష విరమిపజేయించారు మాజీమంత్రి హరీశ్ రావు. ఇది రాజకీయాల కోసం చేస్తున్న దీక్ష కాదని అన్నారు. ఒకరు దత్తత అన్నారు, ఒకాయన వలసల జిల్లా చేశారని ధ్వజమెత్తారు. 60ఏళ్లలో మీరు కట్టిన రిజర్వాయర్లు 25, 9ఏళ్లలో 25 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మేజర్ పార్ట్ మేము పూర్తి చేశామన్నారు హరీశ్ రావు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు.
”మూడు సీజన్లు పోయాయి. 50 టీఎంసీలు నిలుపుకునే అవకాశం ఉండేది. అన్ని నీళ్ళు మన రిజర్వాయర్ లలో ఉంటే మన పాలమూరు ఎట్లా ఉండేది? అనేక కేసులు వేసి ప్రాజెక్ట్ పనులకు అడ్డుకట్ట వేశారు. నల్లమల పులి కాదు..పిల్లి అది… కాలువ చేయడం చేతకావడం లేదు. కేఎల్ఐలో వనపర్తి నియోజకవర్గం లేదు. నిరంజన్ రెడ్డి ఒప్పించి వనపర్తికి నీళ్ళు ఇప్పించారు. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ప్రతిపాదించింది. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదని ఏదుల నుండి నీళ్ళు పారుతాయని ఆనాడే చెప్పాం. మీ కమీషన్ల కక్కుర్తి కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయొద్దు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను జూరాల దగ్గర కట్టేది ఉండే అంటున్నారు. బుద్ధి ఉన్న ఎవరైనా అది కరెక్ట్ అంటారా?
జూరాల ఆయకట్టు క్రాప్ హాలిడే. కల్వకుర్తి లిఫ్ట్ ఇప్పటికీ నడుస్తుంది. కాలువల్లో నీళ్ళు పోతున్నాయి. శ్రీశైలంలో రోజుకి రెండు టీఎంసీలు గుంజుతం అని డిజైన్ చేశారు. బీఆర్ఎస్ పాలమూరు జిల్లాను అద్భుతంగా ప్రగతిపథంలో నడిపింది. రెండున్నరేళ్లలో 10వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా? వలసలు వాపస్ అని బీఆర్ఎస్ హయాంలో వార్తలు రాశారు. పాలమూరు పచ్చని రంగు వేసుకుందని పేపర్ లో హెడ్డింగ్ లు వచ్చాయి. కేరళ వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఏమీ చేయలేదు గానీ.. కేరళ వెళ్ళి అన్ని చేసేశామని ముచ్చట్లు చెబుతున్నారు.
రెండున్నరేళ్లు అవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయరా?
నాలుగు రైతుబంధులు ఎగ్గొట్టారు. ఒక్కసారి మాత్రమే పూర్తిగా ఇచ్చారు. వనపర్తిలో ఏ ఊరికి అయినా వెళ్దాం. రుణమాఫీ వంద శాతం పూర్తయితే నేను రాజీనామా చేస్తా. కాకపోతే నువ్వు కూడా చేయాలి. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సంతకం వేసి ఇచ్చారు. రెండున్నరేళ్లు అయితే ఇంకా ఆరు గ్యారెంటీలు అమలు చేయరా? ప్రభుత్వంతో పోరాడతాం. మీ భూములు కాపాడుతాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం” అని హరీశ్ రావు అన్నారు.
”రెండున్నరేళ్లుగా మోటర్లు ఆన్ చేయడం లేదు. వట్టేంలో పంపులు మునిగితే ఒక్కసారి కూడా అటు వైపు చూడలేదు. ఎస్ఎల్ బీసీలో మృతదేహాలను తీయలేకపోయారు. కాంట్రాక్టర్లను బతికించడానికి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కావాలనే పెండింగ్ పెట్టారు. యూరియా బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు” అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
