ఇప్పటికిప్పుడు పాదయాత్ర సరైన నిర్ణయమేనా? అసలు కేటీఆర్ స్ట్రాటజీ ఏంటి?

పదేళ్లు అధికారంలో ఉండడంతో.. క్షేత్రస్థాయిలో నేతలు, జనాలతో గులాబీ పార్టీకి గ్యాప్‌ పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయ్.

ఇప్పటికిప్పుడు పాదయాత్ర సరైన నిర్ణయమేనా? అసలు కేటీఆర్ స్ట్రాటజీ ఏంటి?

Gossip Garage Ktr Padayatra (Photo Credit : Google)

Updated On : November 2, 2024 / 11:18 PM IST

Gossip Garage Ktr Padayatra

Gossip Garage : పాదయాత్రలో ప్రతీ అడుగు రాజకీయాన్ని మలుపు తిప్పుతుంది. ఆయన, ఈయన కాదు.. ప్రతీ ఒక్కరి విషయంలో ఇదే జరిగింది.. జరుగుతోంది. ఇక్కడ పడే అడుగు.. డైరెక్ట్‌గా అధికార పీఠానికి తీసుకెళ్లింది చాలాసార్లు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఆయనకు, పార్టీకి ఇప్పటికిప్పుడు ఇది నిజంగా అవసరమా.. తొందరపడి ముందే మొదలుపెడతారా.. పార్టీ నేతలు, కేడర్ ఆకాంక్ష మేరకు పాదయాత్రకు సిద్ధం అన్న కేటీఆర్‌ మాటలకు అర్థమేంటి.. అసలు పాదయాత్ర ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు..

వైఎస్‌ నుంచి చంద్రబాబు, జగన్‌, రేవంత్‌ వరకు..
పార్టీ కేడర్‌ ఆకాంక్షల మేరకు పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్‌ ప్రకటించిన తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివే. అధికారం కోసం పాదయాత్ర పేరుతో అడుగులు వేయడం.. తెలుగు రాజకీయాల్లో కొత్తేం కాదు. జనాలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు.. పాదయాత్రలు ప్రధాన అస్త్రం. వైఎస్‌ దగ్గరి నుంచి ఆ తర్వాత చంద్రబాబు, జగన్‌.. నిన్నమొన్న రేవంత్ వరకు ఇలా అడుగులు వేసిన వాళ్లే ! అధికారం దక్కించుకున్న వాళ్లే. బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా పాదయాత్రకు సిద్ధమని ప్రకటించారు. ఆయన నిర్ణయం.. తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కారు పార్టీతో పాటు.. అధికారపక్షంలోనూ కేటీఆర్ నిర్ణయంపై హాట్‌హాట్‌ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పుడు చేస్తే లాభమా నష్టమా..
రెండు దఫాలు.. దాదాపు తొమ్మిదేళ్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయింది. ప్రభుత్వ వైఫల్యాలను తమ స్టైల్‌లో ఎండగడుతూ.. గులాబీ పార్టీ నేతలు దూకుడు చూపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడ మరింత దూకుడు చూపించబోతుందా అని కేటీఆర్ నిర్ణయంతో చర్చ మొదలైంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. ఆస్క్ విత్ కేటీఆర్‌ పేరుతో జనాలు అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తుంటారు. ఇలా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తాను పాదయాత్రకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కేటీఆర్ ఇలా చెప్పారో లేదో.. ఆ ఆన్సర్ వైరల్ అయింది. కేటీఆర్ పాదయాత్ర చేసేది ఎప్పుడు.. ఇప్పుడే చేస్తారా.. గ్యాప్ తీసుకుంటారా.. అసలు ఇప్పటికిప్పుడు పాదయాత్ర అవసరమా.. ఇప్పుడు చేస్తే లాభమా నష్టమా.. ఇలా రకరకాల చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

కేడర్‌కు దూరంగా ఉంటారని కేటీఆర్‌ మీద అపవాదు..
కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై అటు ఇటుగా ఏడాది అవుతోంది. మరి ఇప్పుడే కేటీఆర్ పాదయాత్రకు దిగుతారా.. లేదంటే మరో ఏడాది సమయం తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్‌.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పక్కా పొలిటికల్ పార్టీగా మారింది. ఆ తర్వాత బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది.

పదేళ్లు అధికారంలో ఉండడంతో.. క్షేత్రస్థాయిలో నేతలు, జనాలతో గులాబీ పార్టీకి గ్యాప్‌ పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయ్. ఇది మారాలంటే.. ఆ గ్యాప్‌నకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే.. కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే బెటర్ అని.. జనాలతో మమేకం అయ్యే చాన్స్ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్‌లో, పార్టీలో కేటీఆర్‌ నంబర్‌ 2గా ఉన్నారు. ఐతే కేడర్‌కు దూరంగా ఉంటారని ఆయన మీద ఓ అపవాదు ఉంది. పాదయాత్ర నిర్వహిస్తే ఇలాంటి అభిప్రాయాలను తొలగించినట్లు అవుతుందని బీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది.

అరెస్టులు జరిగితే అందులో కేటీఆర్‌ కూడా..!
ఇక కేటీఆర్‌ జోరుకు బ్రేక్‌లు వేసేందుకు.. రేవంత్ సర్కార్ సిద్ధం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. పొంగులేటి పేల్చిన పొలిటికల్‌ బాంబ్‌లకు అర్థం అదే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌ నేతల అరెస్టులు జరిగితే.. అందులో కేటీఆర్‌ కూడా ఉండే చాన్స్‌ ఉందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ సర్కార్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నది పార్టీ నేతల అనుమానం. ఇవన్నీ కూడా పాదయాత్ర మొదలుపెట్టేలా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. పాదయాత్ర మొదలుపెడితే.. కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయొచ్చని గులాబీ నేతలు అంటున్నారు. ఐతే ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉండడంతో.. ఇప్పటికిప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశాలు లేవని మెజారిటీ వర్గాల అభిప్రాయం.

Also Read : ‘పొలిటికల్ బాంబ్’ విషయంపై మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు