Telangana Rain : తెలంగాణలో రేపు భారీ వర్షాలు
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.

Telangana Rain
Telangana Rain : తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు. అలాగే, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు(జూన్ 26,2021) ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే, రేపు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 4న తెలంగాణను తాకాయి. దీంతో తొలకరి వర్షాలు కురిశాయి. ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల్లో కదలికలు లేక వానలు పడటం లేదు. వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది మూడు డిగ్రీలు అదనం. మొదట్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు.