గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్.. ప్రధాన పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు.. ఏం జరుగుతోంది?
ప్రసన్న హరికృష్ణ, రవీందర్ సింగ్‌తో పాటు.. ట్రెస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్ రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచికట్ల ఆశమ్మ, బక్క జడ్సన్, మంద జ్యోతి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు.

TG graduate elections
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు.. స్వతంత్ర్య అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. ఆ అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు. అంచనాలను తారుమారు చేస్తూ.. అసలు తగ్గేదే లే అని దూసుకుపోతున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ల ఎఫెక్ట్ మరింత ఎక్కువ ఉంది.
గెలవలేకపోవచ్చు కానీ.. గెలుపును మాత్రం డిసైడ్ చేస్తాం అన్నట్లు కనిపిస్తున్నారు వాళ్లంతా. దీంతో ఎన్నికలు మరింత రంజు మీద కనిపిస్తున్నాయ్. ప్రధాన పార్టీలను భయపెడుతున్న ఆ స్వతంత్ర్య అభ్యర్థులు ఎవరు.. వీళ్లను చూసి వాళ్లకు ఎందుకంత భయం..
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. జనరల్ ఎన్నికల్లాంటి హీట్ పుట్టిస్తున్నాయ్. టీచర్ ఎమ్మెల్సీ పోటీ ఎలా ఉన్నా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయ్. భారీ లెవల్‌లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈసారి ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయ్. ఈ ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడే చాన్స్ ఉండడంతో.. ఎమ్మెల్సీ ఎలక్షన్‌ను రెండు పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయ్. ఐతే ఆ పార్టీల అభ్యర్థులను.. ఇండిపెండెంట్‌లు టెన్షన్ పెడుతున్నారు.
ఈ స్థానం నుంచి 56మంది అభ్యర్థులు
ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్‌లు సవాల్ విసురుతున్న వేళ.. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయ్. ఈ స్థానం నుంచి 56మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ తరఫున అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు.. ఈ ఇద్దరి గెలుపు కోసం రెండు పార్టీలు చాలా కష్టపడుతున్నాయ్.
నరేందర్ రెడ్డి కోసం మంత్రులంతా రంగంలోకి దిగారు. కరీంనగర్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం.. నిజామాబాద్‌లో జూపల్లి, ఆదిలాబాద్‌లో సీతక్క ప్రచారం చేస్తున్నారు. ఇక అటు ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లంతా అంజిరెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మీద బీజేపీ.. బీజేపీ మీద కాంగ్రెస్ మాటల దాడి పెంచుతూ రాజకీయాన్ని హీట్ పుట్టిస్తున్న వేళ.. ఇండిపెండెంట్‌లు మరింత ఇంట్రస్టింగ్‌గా మారారు.
ప్రధాన పార్టీలకు ప్రసన్న హరికృష్ణ టెన్షన్
చిన్న చిన్న పార్టీలు.. స్వతంత్ర అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ప్రధాన పార్టీలకు తక్కువ కాదంటూ.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విద్యారంగంలో సేవలందించడంతో పాటు.. పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా.. గ్రాడ్యుయేట్స్‌లో, నిరుద్యోగుల్లో హరికృష్ణకు పేరు ఉంది.
పైగా ఆయన భారీగా ఓటర్లను నమోదు చేయించారు. దీంతో ప్రధాన పార్టీలకు ప్రసన్న హరికృష్ణ టెన్షన్ పట్టుకుంది. ఓట్లను ఆయన భారీగా చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇక అటు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతగా ఉన్న రవీందర్ సింగ్‌కు.. ఆ పార్టీ ఓట్లతో పాటు ఉద్యమకారుల సపోర్ట్ లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఓవరాల్‌గా ప్రసన్న హరికృష్ణ, రవీందర్ సింగ్.. భారీగా ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ప్రసన్న హరికృష్ణ, రవీందర్ సింగ్‌తో పాటు.. ట్రెస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్ రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచికట్ల ఆశమ్మ, బక్క జడ్సన్, మంద జ్యోతి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. వీళ్లంతా ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
దీంతో గెలుపు లెక్కలు వేసుకుంటున్న వాళ్లు.. వీళ్ల దెబ్బకు వణుకిపోతున్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వ్యక్తిగత పరిచయాలతో పాటు.. అభ్యర్థులు వివిధ రంగాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు.. సామాజిక సమీకరణాలతో పాటు బీసీ నినాదం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో స్వతంత్ర అభ్యర్థులు.. ఎవరు ఎలా కొంప ముంచుతారోననే టెన్షన్.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.