Chandrababu Naidu: కేసీఆర్ నోట చంద్రబాబు మాట.. అందుకేనా?
గులాబీ బాస్ పాత అస్త్రాన్ని బయటికి తీసి కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు తీరుపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2001లో హైదరాబాద్ జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజులను గుర్తుచేసిన గులాబీ దళపతి..చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జలదృశ్యాన్ని కూల్చివేశాడని ఫైర్ అయ్యారట.
మళ్లీ ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని..కుట్రలను గమనించాలని కేసీఆర్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించడానికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్లే..తెలంగాణలో విభజనకు ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం నుంచి మొదలు అన్ని రంగాలు కుదేలైపోయాయని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పూర్తిగా నెరవేర్చలేదని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమవుతోందని, ఇదే అదునుగా చంద్రబాబు తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ కామెంట్ చేశారని సమాచారం.
ఒక్కసారిగా నైరాశ్యం
గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడంతో నేతలు, కార్యకర్తల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ప్రచారం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో..టీడీపీ అవకాశాలను వెతుక్కుంటుందని కేసీఆర్ అన్నారట. అందుకే పార్టీ నేతలు ఏ మాత్రం కుంగిపోకుండా వారికి కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, ఇక బీఆర్ఎస్‌కు మంచి రోజులు రాబోతున్నాయని, వందశాతం అధికారం మనదేనని నాయకుల్లో జోష్ నింపారట.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పినట్లు నిజంగానే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై దృష్టి పెట్టారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని గతంలో బాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. అయితే రెండు మూడు నెలల క్రితం మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు.
మనవరాలి పెళ్లికి ఇన్వైట్ చేసేందుకే కలిశానని మల్లారెడ్డి చెప్పినా..తీగల మాత్రం తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తీగలకు టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కూడా టాక్ నడిచింది. ఇక మాజీ మంత్రి బాబు మోహన్ కూడా తిరిగి టీడీపీ గూటికి చేరారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టీడీపీ ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు
అయితే టీడీపీ సెపరేట్‌గా కాకుండా బీజేపీ, జనసేనతో కలిసి ఎన్డీయే రూపంలో గ్రేటర్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసేందుకు వ్యూహాలు ప్రిపేర్ చేస్తుందని టాక్. మొన్నామధ్య ఢిల్లీకి వెళ్లిన లోకేశ్..పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌ను కలిసి తెలంగాణ పాలిటిక్స్‌పై డిస్కస్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ డెవలప్‌మెంట్స్ నేపథ్యంలోనే కేసీఆర్ నోట చంద్రబాబు మాట వచ్చినట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు.
ఏపీలో కూటమి అధికారంలో ఉండటంతో..ఇదే ఊపులో తెలంగాణలో అంతో ఇంతో ప్రభావం చూపాలని చంద్రబాబు భావిస్తున్నారట. గెలుపు, అధికారం అనేదానికంటే ప్రభావం చూపేస్థాయిలో లేక కింగ్ మేకర్‌గా ఉండాలనేది చంద్రబాబు ప్లానట. ఇలాంటి రాజకీయ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కేసీఆర్..పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి అసహనం వ్యక్తం చేశారట. మరోసారి పరాయి పాలకుల చేతిలోకి పోతే..గతంలో అయిన గాయాల నుంచి ఇంకా కోలుకోవడం కష్టమన్నట్లుగా చెప్పుకొచ్చారట కేసీఆర్.
అయితే గులాబీ బాస్ పాత అస్త్రాన్ని బయటికి తీసి కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబును బూచిగా చూపించి తిరిగి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నవాళ్లు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉంటుందా లేదా అంటే డౌటే అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. బీజేపీ, జనసేనతో కూటమిగా వస్తే కొంత ప్రభావం చూపొచ్చని అంటున్నారు. కేసీఆర్ అంటున్నట్లుగా చంద్రబాబు తెలంగాణలో గేమ్ స్టార్ట్ చేయనున్నారా.? అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది వేచి చూడాలి మరి.