Ap Rains : ఏపీకి రెయిన్ అలర్ట్..! 3 రోజులు భారీ వర్ష సూచన..
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Ap Rains (Photo Credit : Google)
Ap Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు ప్రయాణిస్తోందని ఐఎండీ పేర్కొంది. నైరుతి బంగాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.
ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
Also Read : ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి