Telangana :ధ్వజస్తంభం లేని శివాలయం..గంగమ్మ ఒడిలో దాక్కుని 6నెలలే దర్శనమిచ్చే ఉమామహేశ్వరుడు

ప్రకృతి ఒడిలో కొలువైన ఉమామహేశ్వరుడు. గంగమ్మ ఒడిలో దాక్కుని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమించే పరమశివుడు పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలోని గోదావరి నదిలో కొలువైన ఆ మహాశివుడి కోవెలకు ఉండే ప్రత్యేకతలు ఎన్నో..ఎన్నెన్నో..

Telangana :ధ్వజస్తంభం లేని శివాలయం..గంగమ్మ ఒడిలో దాక్కుని 6నెలలే దర్శనమిచ్చే ఉమామహేశ్వరుడు

Umamaheswara Water Temple In Telangana

umamaheswara water temple In Telangana : దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటికి మాత్రమే చారిత్రక నేపథ్యం ఉంది. శతాబ్దాల చరిత్రను తమలో దాచుకున్న కొన్ని ఆలయాల్లో అడుగడుగునా వింతలు విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలాంటి ఆలయమే నిజామాబాద్ జిల్లాలో ఉంది. అక్కడ కొలువైన శివుడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. మిగతా ఆరు నెలలు గోదారమ్మ ఒడిలోకి చేరిపోతాడు. అంతేకాదు అక్కడ గర్భగుడికి ద్వారం ఉండదు.. ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉమ్మెడ ఉమామహేశ్వరుడి సన్నిధిలో భక్తులను ఆశ్చర్యపరుస్తాయి.

శివుడు నిర్మలుడు, నిరాకారుడు, నిరాడంబరుడు, లింగాకారంలో దర్శనమిచ్చే ఆదిభిక్షువు. ఆయన ఏకాంత ప్రదేశాలలో సంచరించడానికి ఇష్టపడతాడు. ప్రకృతిలో నిమగ్నమై ఉంటాడు. అందుకే మనదేశంలోని చాలా శైవక్షేత్రాలు రణగొణధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఉమామహేశ్వరుడి ఆలయం కూడా అలాంటి ప్రాంతంలోనే ఉంది. చుట్టూ విశాలమైన నీలాకాశం.. కనుచూపు మేరలో గోదావరి తీరం.. ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే ప్రాంతం.. కోదండరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం.. సైకత లింగం కొలువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. ఉమామహేశ్వరుడి సన్నిధి.

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని.. ఉమామహేశ్వర ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయం ప్రకృతి ఒడిలో కొలువైంది. ఉమామహేశ్వర పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. కాశీలో ఉన్నట్లుగానే.. ఇక్కడ కొలువైన శివలింగంపై త్రినేత్రం కనిపిస్తుంది. కల్యాణ చాణక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఆలయ మండపానికి మూడు ముఖ ద్వారాలు ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముడు చేసిన సైకత లింగమే ఇక్కడ కొలువుదీరిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేతక ఏంటంటే గర్భగుడికి తలుపులు ఉండవు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఉమామహేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు.

కేవలం ఆరు నెలలు మాత్రమే ఉమామమేశ్వరస్వామి దర్శనం భక్తులకు కలుగుతుంది. మిగతా ఆరు నెలలు స్వామి గోదావరి ఒడిలోకి చేరిపోతారు. ఏటా గోదావరికి వరదొచ్చినప్పుడల్లా.. ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నా… ఇక్కడి శివాలయం గోదావరి ఒడిలోకి వెళ్లిపోతుంది. సుమారు 6 నెలల పాటు పూజలు, ధూపదీప నైవేధ్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గోదావరి జోరు తగ్గిన తర్వాత మళ్లీ ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య పూజలు చేస్తుంటారు.

ఉమ్మెడలో కొలువైన ఉమామహేశ్వరుడిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్ముతారు. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఇక శివరాత్రి, కార్తీకమాసాల్లో ఆలయం ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారిపోతుంది.

ప్రతిఏడాది దాదాపుగా ఆరు నెలల పాటు నీట్లోనే ఉన్నా.. ఆలయం మాత్రం చెక్కు చెదరదు.సాధారణంగా అంతకాలం పాటు నీట్లో ఉంటే ఎలాంటి నిర్మాణమైనా కొన్నేళ్లకు శిథిలావస్థకు చేరుకుంటుంది.
కానీ ఉమామహేశ్వరుడి ఆలయం విషయంలో అలాంటిదేమీ జరగలేదు. దాదాపు వెయ్యేళ్ల కింద నిర్మాణం జరిగినా… ఇప్పటికీ అంతే బలంగా ఉంది. ఇప్పుడు వర్షకాలం వస్తుండడంతో ఉమామహేశ్వరుడు గోదారమ్మ ఒడిలోకి చేరుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ముంపు మొదలైతే మరో ఆరు నెలల వరకు స్వామి దర్శనం దొరకదు. అందుకే భక్తుల తాకిడి మెల్లగా పెరుగుతోంది.