Azam Jahi Building Controversy: అట్టుడుకుతున్న ఆజంజాహి వెనుక అసలు కథేంటి? సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారా?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మంత్రి సురేఖ ఇదే భూమిలో వ్యాపారి కాసంతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వరంగల్‌లో ఓ గాసిప్ చక్కర్లుకొడుతోంది.

Azam Jahi Building Controversy: అట్టుడుకుతున్న ఆజంజాహి వెనుక అసలు కథేంటి? సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారా?

Updated On : December 21, 2024 / 11:28 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారా? ఆజంజాహి వివాదంలో కొండా కొట్టిన కొబ్బరికాయ బెడిసి కొట్టిందా? కార్మిక భవన్ కూల్చివేతలో మంత్రి భర్త మురళి ఫిలాసఫి తిరగబడిందా? వస్త్ర వ్యాపారి వ్యవహారం కొండా దంపతుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందా? అట్టుడుకుతున్న ఆజంజాహి వెనుక అసలు స్టోరీ ఏంటి?

కొండా దంపతులు.. పొలిటికల్ ఫైర్‌ బ్రాండ్స్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలంగా మంత్రి సురేఖ చుట్టు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె మైక్ పట్టుకున్నా.. కొబ్బరికాయ కొట్టినా.. అగ్గిరాజుకుంటుందనే గాసిప్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. వరంగల్ జిల్లా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆజంజాహి మిల్స్ కార్మిక భవన్ జోలికి వెళ్లి అప్రతిష్టను మూటగట్టుకున్నారనే చర్చ జిల్లా అంతటా సాగుతోంది.

సొంత పార్టీ నేతలు కూడా భగ్గుమంటున్నారా?
వస్త్ర వ్యాపారి కాసం ఓం నమ:శివాయ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునాది రాయి వేసిన ఘటన, చెలరేగిన వివాదం ఉమ్మడి వరంగల్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. పురాతన ఆజంజాహి మిల్స్ ట్రేడ్ యూనియన్ ఆఫీసు కార్మిక భవనం కూల్చివేతతో మంత్రి కొండా సురేఖ దంపతుల పేరు చెబితే సొంత పార్టీ నేతలు కూడా భగ్గుమంటున్నారని పార్టీ ఇన్‌సైడ్ టాక్.

వరంగల్‌ వెంకట్రామ థియేటర్ సమీపంలో ఆజాంజాహి మిల్లుకు సంబంధించిన 10వేల మంది కార్మికులు పైసా పైసా కూడబెట్టుకుని కడుపు కట్టుకుని 1944 సంవత్సరంలో 12 గుంటల స్థలంలో కార్మిక భవన్ నిర్మించుకున్నారు. ఈ భవన్ వేదికగానే.. అనేక ప్రజా పోరాటాలు, వామపక్ష ప్రగతిశీల ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయి. ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తిని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వందేళ్ల చరిత్ర ఆ భవన్ సొంతం. రాజకీయ నేతలకే కాదు సాహితివేత్తలకు, కవులకు సైతం గొంతెత్తే వేదికై నిలిచింది ఆ కార్మిక భవన్‌..

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత తాజా మాజీ నన్నపనేని నరేందర్ ఈ భవనం ప్లేస్‌ కాజేయడానికి ప్రయత్నించారని అప్పట్లో మావోయిస్టులు లేఖ కూడా రిలీజ్ చేశారు. ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కి నినదించాయి. ఇలా ఆజాంజాహి మిల్లు కార్మికభవన్ వివాదాస్పద భూమిగా మారి నిర్మాణాలు నిలిచిపోయాయి.

అన్నీ ధ్వంసం చేశారా?
అయితే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మంత్రి సురేఖ ఇదే భూమిలో వ్యాపారి కాసంతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వరంగల్‌లో ఓ గాసిప్ చక్కర్లుకొడుతోంది. కొండా మురళి కొబ్బరికాయ కొట్టిన గంటలోనే ఆజంజాహి కార్మిక భవన్ నేలమట్టం అయింది. రాత్రికి రాత్రే మూడో కంటికి తెలియకుండా కార్మిక భవన్ ఆనవాళ్లు మాయం అవ్వడంతో స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అందులోని రికార్డులు, అప్పటి లెడ్జర్స్ అన్నీ ధ్వంసం చేశారనే గాసిప్ జిల్లాలో బిగ్ సౌండ్ చేస్తోంది.

ఆజంజాహి కార్మిక భవన్ కూల్చివేతపై ఒక్కసారిగా ప్రజాగ్రహం పెల్లుబికడంతో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ వెంటనే యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. అజంజాహి మిల్లు కార్మికుల యూనియన్ భవనం పేద కార్మికులకే చెందేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ హామీ ఇచ్చారు. ఐతే ఈ యూటర్న్‌కు తెరవెనుక పెద్ద మంత్రాంగమే జరింగిందనే టాక్‌ నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో అనూహ్యంగా కొండా మురళి వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది.

సంక్రాంతి సినిమాల పండుగ అక్కడేనా..? పోటాపోటీ ప్రమోషన్లు..!