షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదు, ఇది చంద్రబాబు కుట్రే- సజ్జల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy On YS Sharmila And Chandrababu Naidu
Sajjala Ramakrishna Reddy : కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని చెప్పారు. అయితే, షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చి చెప్పారాయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.
Also Read : రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి
అంగన్ వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపైనా సజ్జల స్పందించారు. ఎస్మా ప్రయోగం సమంజసమే అని అన్నారు. అంగన్ వాడీల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన వాపోయారు. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్ వాడీలు ఉన్నారని అన్నారు. వారు తిరిగి విధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని, అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
కాంగ్రెస్ పార్టీపైనా సజ్జల సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ పై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ”వైసీపీ తొలినాళ్లలో ఆ పార్టీ వివేకాను బరిలో నిలిపింది. కాంగ్రెస్ తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ పార్టీలో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. బ్రదర్ అనిల్ ను టీడీపీ నేతలు గతంలో ఎలా అవమానించారో చూశాం. ఇప్పుడు ఆయన పక్కన నిలబడి ఫొటోలు దిగుతున్నారు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
”గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. షర్మిల ఏ రోజు అయితే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆరోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ లోకి రావడం, దాని వెనుక ఎవరున్నారో ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. చంద్రబాబు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తూ, మరోవైపు తన మనుషుల ద్వారా బీజేపీని మేనేజ్ చేస్తూ, పవన్ కల్యాణ్ ను మేనేజ్ చేస్తూ.. రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ మేనేజ్ చేస్తున్నారు. ఎలాగో అలా జగన్ ను అర్జెంట్ గా దించేయాలి అని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడలేరు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అని చెప్పుకోలేరు చంద్రబాబు. ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల చేరిక చంద్రబాబు కుట్రే.
సీఎం రమేశ్ ఫ్లైట్ లో వెళ్లడం, బ్రదర్ అనిల్ ను బీటెక్ రవి కలవడం.. ఇవన్నీ యాధృచికం అని మేము అనుకోవడం లేదు. బ్రదర్ అనిల్ పై టీడీపీ నేతలు ఏ రకంగా దుమ్మెత్తి పోశారో అందరికీ తెలుసు. ఇప్పుడు మర్యాదపూర్వకంగా బ్రదర్ అనిల్ ను కలిశాను అని చెప్పుకోవడం నాకు అర్థం కాలేదు. షర్మిల ఇష్టం. ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఏపీకి అయినా రావొచ్చు, ఎక్కడికైనా వెళ్లొచ్చు. అది ఆమె ఇష్టం. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి కుట్రలు చేశారు. కడప ఉపఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేశాయి” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read : వైసీపీకి షాక్.. పొలిటికల్ ఇన్నింగ్స్‌కి అంబటి రాయుడు బ్రేక్
అంతా చంద్రబాబే చేశారు- సజ్జల సంచలన ఆరోపణలు
1. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది.
2. షర్మిల ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు.
3. షర్మిలతో వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు.
4. రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు.
5. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు.
6. కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకోము.
7. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరు?
8. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
9. చంద్రబాబు.. ఓవైపు కాంగ్రెస్ ను, మరోవైపు బీజేపీని మ్యానేజ్ చేస్తున్నారు.
10. ఏదో ఒకరకంగా జగన్ ను దించాలనేది చంద్రబాబు కుట్ర.
11. కడప ఉపఎన్నిక సమయంలోనే టీడీపీ, కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేశాయి.
12. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు.
13. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయి.
14. జగన్ పై తప్పుడు కేసులు వెనుక టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయి.