కేసులకు భయపడొద్దు, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే- జగన్ కీలక వ్యాఖ్యలు

చివరికి పలావూ పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.

కేసులకు భయపడొద్దు, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే- జగన్ కీలక వ్యాఖ్యలు

Updated On : October 3, 2024 / 5:16 PM IST

Ys Jagan Mohan Reddy : కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేస్తోందని కూటమి సర్కార్ పై ధ్వజమెత్తారు. గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ పాలనలో తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది అన్నదానిపై ప్రతీ ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు జగన్. తాడేపల్లిలో ఉమ్మడి పశ్చిమగోదావరి నేతలతో జగన్ సమావేశం అయ్యారు. కేసులకు భయపడకుండా ప్రజల తరుపున పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్.

”మన ఐదేళ్ల పాలనలో ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ప్రజలకు చెప్పిన ప్రతీ మాట నేరవేర్చాం. మ్యానిఫెస్టోను ప్రతీ రాజకీయ పార్టీ ఇస్తుంది. ఎన్నికలయ్యాక దాన్ని చెత్తబుట్టలో వేస్తారు. ఆ పరిస్థితి నుంచి మ్యానిఫెస్టో అన్నదానికి ఒక డెఫినిషన్ ఇచ్చి, మ్యానిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని నమ్మాం. తొలి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా హామీలు అమలు చేశాం. మన ప్రభుత్వం చూసిన కష్టాలు ఎవరూ చూసి ఉండరు. ఎప్పుడూ చూడని కొవిడ్ లాంటి సమస్యను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా రెండేళ్లు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాము.

ఎప్పుడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఎప్పుడూ ముఖాన చిక్కటి చిరునవ్వు చూపించాం. చిరునవ్వుల మధ్యే ప్రజలకు మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదేమో. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి.. ఏ నెల ఏ పథకం ఇస్తామో చెప్పాము. ఏడాది పొడవున స్కీమ్ లు ఇచ్చాము. బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే లేదు. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఇవాళ చంద్రబాబు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. రెగులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నడుస్తోంది.

ఆ బడ్జెట్ ప్రవేశపెడితే.. ఏ స్కీమ్ కి ఎంత పెట్టాలో చెప్పాలి వస్తుంది. ఆ వివరాలు చెప్పకపోతే ప్రజలు చంద్రబాబును తిడతారేమో, కొడతారేమో అనే భయంతో ఏకంగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం లేదు. మనమేమో ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేశాం. జగన్ ఏమో పలావు పెట్టాడు, చంద్రబాబు ఏమో బిర్యానీ పెడతానని అన్నారు. చివరికి పలావూ పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది. సూపర్ సిక్స్ ఏమయ్యాయి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు” అని జగన్ అన్నారు.

విద్యా దీవెన, వసతి దీవెన పోయాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా అందని పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. గోరుముద్ద కార్యక్రమాన్ని నీరుగార్చే పరిస్థితి. వైద్య రంగం అదే పరిస్థితి. మన హయాంలో ఇసుకను అమ్మిన రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కనీసం అప్పుడు ప్రభుత్వానికి అన్నా ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, మనం అమ్మిన రేటుకన్నా ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్న పరిస్థితి. మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి అని మనం తాపత్రయపడ్డాం. వీళ్లేమో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ స్కాములే. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎవరైనా కేసు పెడితే రివర్స్ లో మనపైనే దొంగ కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల పాలనలోనే ప్రతి వ్యవస్థ దిగజారిపోయిన పరిస్థితి ఉంది. ప్రజల తరుపున మనం ఉద్యమించాలి. ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి. ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్.

 

Also Read : వైసీపీ సీనియర్ నేత దారెటు? ఆయనను వెంటాడుతున్న ఆ భయం ఏంటి..