Kabul airport : కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.

K8
Kabul airport అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని అబ్బే గేట్ దగ్గర భారీ పేలుడు సంభవించిందని పెంటగాన్(అమెరికా రక్షణమంత్రిత్వశాఖ కార్యాలయం)మీడియా సెక్రటరీ జాన్ కిర్బే ఓ ట్వీట్ లో తెలిపారు.
ఇక,ఈ పేలుడు ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు సహా పలువురు అప్ఘానీయులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రదేశంలో తాలిబన్లు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, భారత్ సహా పలుదేశాలు అప్ఘానిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి తమ తమ దేశాల పౌరులను స్వదేశాలకు తరలిస్తున్న సమయంలో ఈ పేలుడు ఘటన కలకలం రేపుతోంది.
కాగా, కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలు తమ దేశ పౌరులకు ఎయిర్‌పోర్టు నుంచి తక్షణమే బయటకు వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఎయిర్‌పోర్టులో ఉండడం ఏ మాత్రం సురక్షితం కాదని వార్నింగ్ ఇచ్చాయి.
ఇక,కాబూల్ నగరాన్ని తాలిబన్‌లు అష్టదిగ్బంధనం చేసినట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్టుకు దారి తీసే రహదారులన్నింటి మూసివేసినట్లుగా సమాచారం. ఎయిర్‌పోర్టు రహదారులపై తాలిబన్‌ల బలగాల పహారా కాస్తున్నాయి.