Simla Agreement: భారత్ చర్యలకు పాకిస్థాన్ కౌంటర్.. సిమ్లా ఒప్పందం నిలిపివేత
భారత్ ఆరోపణలను పాక్ ఖండించింది. పహల్గాం దాడి వెనుక తమ ప్రమేయం లేదంది.

Simla Agreement: పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. ఉగ్రదాడితో యావత్ భారతం రగిలిపోతోంది. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటించిన భారత్.. వెంటనే యాక్షన్ షురూ చేసింది. పాక్ కు బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ పై ప్రతిచర్యలకు దిగింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. ఆ దేశ పౌరులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ కౌంటర్ ఇచ్చింది. 1972 సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశమైంది. జాతీయ భద్రతపై చర్చించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణనష్టానికి సంతాపం వ్యక్తం చేస్తూనే.. భారత్ ప్రతిఘటనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. వాటిని “ఏకపక్ష, అన్యాయమైన, రాజకీయ ప్రేరేపిత, అత్యంత బాధ్యతారహితమైన, చట్టపరమైన అర్హత లేనివి” అని పేర్కొంది.
సిమ్లా ఒప్పందం 1971 యుద్ధం తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన శాంతి ఒప్పందం. ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ఫలితం కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (LOC) ఏర్పాటు. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ప్రాంతాన్ని విభజించింది. యుద్ధ ఖైదీల తిరిగి రావడం, దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని హామీ ఇవ్వడం కూడా ఈ ఒప్పందంలో వివరించబడింది. ఇప్పుడు, పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ స్పందించింది. భారత్ ఆరోపణలను పాక్ ఖండించింది. పహల్గాం దాడి వెనుక తమ ప్రమేయం లేదంది. పర్యాటకులను కాల్చి చంపడాన్ని ఖండించింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here