ఢిల్లీలో ఇంటింటికీ అమిత్ షా…240మంది ఎంపీలతో బీజేపీ ప్రచారం

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 06:43 PM IST
ఢిల్లీలో ఇంటింటికీ అమిత్ షా…240మంది ఎంపీలతో బీజేపీ ప్రచారం

Updated On : February 5, 2020 / 6:43 PM IST

అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రాష్ట్రం ఫోకస్ పెట్టారంటే ఇక పనైపోయినట్లేనని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. 2014,2019 లోక్ సభ ఎన్నికల్లో అమిత్ షా వ్యూహాలు గట్టిగానే పనిచేశాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్నికల్లో వ్యూహాలు పనిచేయకపోయినా ఎన్నికల అనంతర వ్యూహాల్లో కూడా ఆరితేరినోడే అమిత్ షా.

అయితే ఇప్పుడు ఆయన టార్గెట్ ఢిల్లీ అయింది. దేశరాజధానిలో ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. గడిచిన 20 రోజులుగా ఢిల్లీలోని ప్రతి గడప తొక్కి ఓట్లు అడుగుతున్నారు. ఓ కేంద్ర హోంమంత్రి మొదటిసారి ఇలా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చి తాను చాణుక్యుడినే అని మరోసారి ఆయన నిరూపించుకోవాలనుకుంటున్నారు. 

దాదాపు 240మంది బీజేపీ ఎంపీలు,70మంది కేంద్రమంత్రులు ఢిల్లీలో ప్రచారంలోకి దింపింది బీజేపీ. దీని బట్టి బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీలోనే ఉన్న ఈ ఎంపీలందరూ ఢిల్లీలోని స్లమ్ లలో పర్యటించి రాత్రుల్లు అక్కడే భోజనం,బస చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. 2015నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ హవా ఉన్నప్పటికీ కేవలం 3సీట్లు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం లోక్ సభ సీట్లను గెల్చుకున్న బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల విజయానికి గట్టిగానే కృషి చేస్తుంది. చూడాలి మరి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారో.