Congress: ఈ పరిస్థితులే కాంగ్రెస్‌ను అంతకంతకూ దిగజారుస్తున్నాయా?

ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే...పార్టీగా అయినా, కూటమిగా అయినా అధికారంలోకి రావడం సంగతి పక్కనపెడితే...

Congress: ఈ పరిస్థితులే కాంగ్రెస్‌ను అంతకంతకూ దిగజారుస్తున్నాయా?

Congress Future

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన క్రెడిట్..పార్టీ నిండా ఎవరెస్ట్ శిఖరం స్థాయిలో ప్రజాదరణగలిగిన నాయకులు, పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశాన్ని భాషలు, ప్రాంతాలకతీతంగా ఐక్యంగా ఉంచగల సామర్థ్యం… ఎన్నికలు జరిగే ప్రతిసారీ మరింత బలపడుతున్నట్టుగా సీట్లు పెంచుకోవడం, చీలికలు వచ్చినా…. ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే పార్టీలా నిలవడం…. దేశంలో అతిపెద్ద పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అందరూ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఒకప్పుడు భారత్ అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే భారత్… రాజకీయం అంటే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటే రాజకీయం. మరి అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది..? దేశరాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తోంది…? వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి..?

దేశంలో ఒకప్పుడు ఎన్నికలు జరిగితే విజయం ఎవరిది అని పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. రాష్ట్రాల్లో, జాతీయస్థాయిలో ఎక్కడైనా నిలిచేది, గెలిచేది కాంగ్రెసే. కమ్యూనిస్టులు సహా మిగిలిన చిన్నాచితకా ప్రతిపక్షాలన్నీ సీట్ల లెక్కలకే పరిమితం. కాంగ్రెస్‌కు అపజయం అన్నది తెలియని కాలమది….అప్పుడు కాంగ్రెస్ గెలవడం కోసమే ఎన్నికలు.

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ బలం మరింత స్పష్టంగా దేశానికి, ప్రపంచానికి అర్ధమయ్యేది. ఆ బంగారు కాలం నుంచి కాంగ్రెస్… చివరకు ఎన్నికలంటే భయపడేస్థితిలోకి దిగజారింది. ఇప్పుడు అసెంబ్లీ, సార్వత్రిక.. ఎన్నికలేవైనా…కాంగ్రెస్ బలహీనస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లో అధికారం చేజారిపోవడం, జాతీయస్థాయిలో సీట్ల సంఖ్య తగ్గిపోవడం…వంటి ఫలితాలే కాంగ్రెస్‌కు ఎదురవుతున్నాయి.

పార్టీ బలంగా ఉన్నప్పుడు…నాయకులూ బలంగానే ఉంటారు. పార్టీకి కట్టుబడి ఉంటారు. సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. ఎక్కడెక్కడినుంచో వచ్చి అధికారపార్టీలో చేరేందుకు పోటీపడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే..బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా ఉంటారు. పార్టీ అవసరాలను అర్ధం చేసుకుంటారు. పరిస్థితుల దృష్ట్యా ప్రాధాన్యత దక్కకపోయినా సర్దుకుపోతారు. మరో అవకాశం కోసం వేచిచూస్తుంటారు. కుదిరినప్పుడల్లా పార్టీ భక్తి చాటుకుంటారు.

అధినాయకత్వంతో అపరిమిత వినయ, విధేయలతో నడుచుకుంటారు. అలాంటి నాయకులెందరినో కాంగ్రెస్ చూసింది. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రాలను శాసించే స్థాయికి చేర్చింది. ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దింది. దేశంలో రాజకీయనేత అంటే కాంగ్రెస్ నాయకుడే అనే స్వర్ణయుగం ఒకటి హస్తం పార్టీకి తెలుసు.

పరిస్థితి ఎలా ఉందంటే?
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే….అసలు పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో, ఏ నాయకుడు ఉండడో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎందుకు అలుగుతారో అర్ధం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు కనిపించరు. మొత్తంగా కాంగ్రెస్‌లో మిగిలిఉండే నేతలెందరన్నది ప్రజలకే కాదు…అగ్రశ్రేణీ నాయకత్వానికి తెలియదు.

నిజానికి 1990ల ప్రారంభంలో అప్రతిహత విజయాల దశ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌తో గెలుపోటములు దోబూచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మునుపటికాలనికి, ఇప్పటికీ తేడా కాంగ్రెస్..ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బలహీనపడడం. అదే సమయంలో బీజేపీ… ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బలంగా ఉండడం. ఈ పరిస్థితులే కాంగ్రెస్‌ను అంతకంతకూ దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి నడిచే మిత్రపక్షాలకూ హస్తంపార్టీ గతవైభవం గుర్తురావడం లేదు.

కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైనప్పటికీ……దిశానిర్దేశం చేసే స్థితి…ఆ పార్టీకివ్వకుండా..ముందు అడుగులు తాము వేయాలని, నాయకత్వం స్థానంలో తాముండాలని మిత్రపక్షాలు తహతహలాడుతున్నాయి. మిత్రపక్షాలే కాదు…పార్టీలోని సీనియర్లూ సిద్ధాంతాలకు కట్టుబడడానికి, పార్టీ అవసరాల కోసం త్యాగాలు చేయడానికి, ఒక్కతాటిపై నడిచి కాంగ్రెస్‌కు పునర్‌వైభవం సాధించడానికి సిద్ధంగా లేరు.

మొహం చాటేస్తున్నారు..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు… యూపీఏ హయాంలో కేంద్రమంతులుగా చక్రం తిప్పినవారు, పాలనావిధానాలను శాసించినవారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బలమైన నేతలుగా ఉన్నవారు, అధికారపార్టీ ముఖచిత్రంగా మారేందుకు అలుపెరగక శ్రమించినవారంతా… కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న ఈ పదేళ్ల నుంచి ఒక్కొక్కళ్లుగా మొహం చాటేస్తున్నారు. 2004-2014 మధ్య సోనియాగాంధీ ఆదేశాలను శిరసావహించిన వారిలో కొందరు….వరుసగా రెండోసారి పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే తిరుగుబావుటా ఎగరేశారు.

G23, G26లపేరుతో అసంతృప్తనేతలుగా మారి సమావేశాలు నిర్వహించి… బహిరంగ లేఖలు రాసి… క్రమశిక్షణను ఉల్లంఘించారు. గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాంగ్రెస్‌కు బలమని చెప్పినవాళ్లే…పార్టీ నాయకత్వాన్ని గాంధీకుటుంబేతర వ్యక్తికి అప్పగించాలన్న డిమాండ్లు లేవదీశారు.

గులామ్‌నబీ ఆజాద్, కపిల్ సిబాల్, అశోక్ చవాన్, కమల్‌నాథ్ ఇలా చెప్పుకుంటూపోతే…గాంధీయేతర కుటుంబం తర్వాత కాంగ్రెస్‌లో అగ్రనేతలుగా చెప్పుకునేవారిలో…ఇప్పుడు పార్టీలో మిగిలేవారెవరో తెలియడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే…పార్టీగా అయినా, కూటమిగా అయినా అధికారంలోకి రావడం సంగతి పక్కనపెడితే…543 స్థానాలున్న లోక్‌సభలో..అసలు 50 సీట్లయినా సాధించగలుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Indian Air Force: భారత వాయుసేన సత్తా ఇది