Pawan Kalyan: ఏపీలో వైసీపీని మామూలుగా కొట్టలేదు: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్

"జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది" అని అన్నారు.

Pawan Kalyan: ఏపీలో వైసీపీని మామూలుగా కొట్టలేదు: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్

Updated On : November 17, 2024 / 4:05 PM IST

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ ఆ రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లా, బల్లార్పూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి అభ్యర్థి ముంగంటివార్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఏపీలో వైసీపీని మామూలుగా కొట్టలేదని, మహారాష్ట్రలోనూ అలాగే మూడోసారి మహాయుతి సర్కారు రావాలని కోరారు.

బల్లార్పూర్ అభివృద్ధి కోసం ముంగంటివార్‌ని గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నట్లు చెప్పారు. ”నా పిల్లలు ఇద్దరితో నేను మరాఠీలో మాట్లాడుతాను, భాష మీద గౌరవంతో నేర్చుకున్నాను. విదేశీ భాషలు నేర్చుకునే మనం, మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలి” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

”నేను ఆంధ్రలో మార్పు తీసుకొచ్చి చూపించాను, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించాను. ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలి. మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, బల్లార్పూరు అభివృద్ది చెందాలన్నా, లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి, ఓట్లు వేయండి, రోడ్లు మీదకు రావాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.

”భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మహారాష్ట్ర లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందాలి. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరు అందరూ ఓటు వేయాలి అని కోరుతున్నాను” అని చెప్పారు.

”500 సంవత్సరాల ఎదురుచూపులు తరవాత మనకు అయోధ్య రామ జన్మభూమి లో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. మన బలార్ష ప్రజల అదృష్టం ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయి” అని తెలిపారు.

”జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. ఒకరు ఛత్రపతి శివాజీ గారు, ఇంకొకరు హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ బాలసాహెబ్ ఠాక్రే గారు. బలాసాహెబ్ ఠాక్రే గారి పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను” అని పవన్ చెప్పారు. ధర్మాన్ని రక్షించడానికి ఎన్డీఏను ఎన్నుకోవాలని కోరారు.
మణిపూర్‌లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్‌ బంద్‌.. సీఎం బీరేన్‌ సింగ్‌ ఇంటిపై దాడి..