నేడే విడుదల.. స్విస్ గుట్టు రట్టు: నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 02:48 AM IST
నేడే విడుదల.. స్విస్ గుట్టు రట్టు: నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు

Updated On : May 28, 2020 / 3:44 PM IST

స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న భారతీయుల బండారం బట్టబయలు కాబోతోంది. భారత కుబేరుల బ్లాక్ మనీ వివరాల గుట్టు రట్టు కాబోతోంది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని ఖాతాల గోప్యతకు తెరపడుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల వివరాలు ఇండియా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. నల్లధనంపై పోరుకు కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇది కీలక ముందడుగు కానుంది. 

స్విస్ బ్యాంకులంటే సీక్రెట్‌కు మారుపేరు. ఈ దేశంలోని బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఆ వివరాలేవీ అస్సలు బయటకురావు. ఎవరు దాచారు ఎంత దాచారు లాంటివి మూడో మనిషికి తెలియదు. అందుకే అక్రమార్కులంతా అడ్డంగా డబ్బులు దోచేసి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో దాచారు. ఎవరికీ తమ అక్రమార్జన వివరాలు తెలియవన్న ధీమాతో ఇక్కడ హాయిగా తిరుగుతుండేవారు. కానీ ఇదంతా నిన్నటివరకే… ప్రస్తుతం పరిస్థితి మారింది. వారి పాపాల పుట్టలు పగలబోతున్నాయి. అక్రమంగా దాచిన కరెన్సీ కట్టల లెక్కలు తేలనున్నాయి. 

ఇప్పటికే భారత్, స్విట్లర్లాండ్ ప్రతినిధులు ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిపారు. స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ ఫైనాన్స్‌ విభాగానికి ఉన్నతాధికారులతో భారత రెవెన్యూ కార్యదర్శి స్థాయి అధికారులు రెండ్రోజుల క్రితం కూడా చర్చించారు. పన్నుకు సంబంధించిన భారత్‌ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఇందులో భాగంగా.. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడిని ఇవాళ్టి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో.. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో గతేడాది భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు భారత్‌కు అందనున్నాయి. ఇందులో 2018లో క్లోజ్‌ అయిన ఖాతాల వివరాలు కూడా ఉండబోతున్నాయి.

నల్లధనం గురించి ఖచ్చితమైన నగదు వివరాలను స్విస్ బ్యాంక్ అసోసియేషన్ తొలిసారి వెల్లడించబోతోంది. నల్లధన డిపాజిటర్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారన్న నివ్వెరపోయే నిజాన్ని గతంలోనే ప్రకటించింది స్విస్ బ్యాంక్. భారతీయులు 65 వేల 223 వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపింది. అయితే… భారతీయులున్నారని, అమౌంట్ ఇంత ఉందని చెప్పిన స్విస్‌ బ్యాంక్ వారిపేర్లుగానీ.. వ్యక్తులవారీగా అకౌంట్ల వివరాలుగానీ వెల్లడించలేదు. దీతో… స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్మును బయటపెట్టేందుకు ఉన్న అడ్డుగోడలను తొలగించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి పెంచింది. ఇందులో భాగంగా కొత్త చర్యలకు ఉపక్రమించిన స్విట్జర్లాండ్ సమాచార మార్పిడి ఒప్పందాల మేరకు ఖాతాదారుల వివరాలను అందజేయబోతోంది. దీంతో భారత్‌లోని అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Read More : రైలు ప్రయాణికులకు చేదువార్త