బీజేపీలో చేరిన కర్ణాటక “సింగం” అన్నామలై

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2020 / 03:55 PM IST
బీజేపీలో చేరిన కర్ణాటక “సింగం” అన్నామలై

Updated On : August 25, 2020 / 4:21 PM IST

ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి, సాదరంగా ఆహ్వానించారు.



సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న అన్నామలైని.. కర్ణాటక పోలీస్ సింగంగా అభివర్ణిస్తారు. కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన అన్నామలై ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు గతేడాది మే నెలలో రాజీనామా చేశారు. 2011 బ్యాచ్‌ యువ ఐపీఎస్‌ అధికారి అన్నామలై తమిళనాడులోని కరూర్‌ ప్రాంతానికి చెందినవారు. 2013లో కార్కళ ఏఎస్పీగా సివిల్‌ సర్వీస్‌ కెరీర్‌ ప్రారంభించారు.





ఉడుపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌, చిక్‌మగళూరు జిల్లా ఎస్పీగా, బెంగళూరు దక్షిణ మండలం డీసీపీగా పని చేశారు. ఉడుపి ఎస్పీగా పనిచేస్తోన్న సమయంలో సింగంగా గుర్తింపు పొందారు. ఉడుపి సింగంగా ఆయన గురించి తెలియని వారు జిల్లాల్లో ఎవరూ ఉండకపోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలం ఆయనలో అధికంగా కనిపిస్తుంటుంది. ఆ ప్రభావంతోనే ఆయన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని బీజేపీతో చేశారని చెబుతున్నారు.





వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రమే. అన్నామలై.. బీజేపీలో చేరడం కొద్దో, గొప్పో మేలు కలుగుతుందని అంటున్నారు. సర్వీస్‌లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన ఆయన.. అదే తరహా వైఖరి పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.