ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 01:45 AM IST
ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్

ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చే వారం లేదా చివరి వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం అన్ని రాజకీయ పార్టీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఈసీ కూడా వీరికి ఓ తీపి కబురు తెలిపింది.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్

ఏప్రిల్‌ నుంచి మే నెల వరకు 7, 8 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమకూర్చే పనిలో ఉంది. మార్చి వచ్చేవారం ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని సమాచారం. లోక్‌ సభ పదవీకాలం జూన్‌ 3 నాటికి పూర్తి కానుంది. దీంతోపాటు కొన్ని రాష్ట్రాల పాలనా వ్యవధి కూడా త్వరలోనే పూర్తవనుంది. ఈ కారణంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని ఈసీ వర్గాలు తెలిపాయి.
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్

మరోవైపు కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయి చాలారోజులే అయింది. ఈ ఎన్నికలను కూడా లోక్‌ సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ భద్రతా చర్యలను బట్టి ఎన్నికల నిర్వహణలో మార్పు ఉండవచ్చని సమాచారం. ఇక సిక్కిం అసెంబ్లీ ఈ ఏడాది మే 27 నాటికి పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ పదవీ కాలం జూన్‌ 18న, ఒడిశాలో జూన్‌ 11న, అరుణాచల్‌ ప్రదేశ్‌లో జూన్‌ 1న గడువు తీరనుంది. దేశంలో ఉన్న 543 లోక్‌ సభ స్థానాలకు గానూ 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ సారి ఏడెనిమిది దశల్లో ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2