64 రివ్యూ పిటిషన్లు: ‘శబరిమల’ కేసుపై సుప్రీంలో విచారణ
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం శబరిమల కేసుపై విచారణ చేపట్టింది. జస్టిస్ గొగోయ్‌తో పాటు న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, డీవై చంద్రచూడ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. అయ్యప్ప స్వామివారి దర్శనార్థం 10-50 ఏళ్ల బాలికలు, మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఆలయ సంప్రదాయం.. వివక్షతో ముడిపెట్టొద్దు
మహిళలపై నిషేధం విధించడం లింగ వివక్షను ప్రోత్సహించడమేని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పును ఉపసంహరించుకోవాలంటూ నాయర్ సర్వీస్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది కె. ప్రసరణ్ వాదనలు వినిపిస్తున్నారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాన్ని మహిళలపై వివక్షతో పోలిక పెట్టరాదని, 10 ఏళ్ల నుంచి 50ఏళ్ల లోపు మహిళలకే ఇది వర్తిస్తుందని కోర్టుకు విన్నవించారు.
ఇప్పటికే సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు చెలరేగాయి. కేరళ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 64 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ కేరళకు చెందిన నాయర్ సర్వీసు సొసైటీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం తీర్పుతో కొంతమంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా ఇద్దరు మాత్రమే స్వామివారిని దర్శించుకోగా.. మిగతా వారిని అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వారంతా వెనక్కి తగ్గారు.