Maharashtra: అయ్యో.. గాలి నింపుతుండగా నోట్లో పేలిన బెలూన్.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

Balloon Burst eight year old girl died
Maharashtra: స్కూళ్లకు వరుస సెలవులు వచ్చాయంటే చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతూ సంతోషంగా గడుపుతారు. ఈ క్రమంలో కొందరు బెలూన్స్ ఊదుతూ, వాటిని గాల్లోకి ఎగురవేస్తూ ఆటలాడుతుంటారు. అయితే, బెలూన్ లో గాలిని నింపుతున్న సమయంలో మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి బెలూన్ లో నోటితో గాలి నింపుతున్న క్రమంలో అది ఒక్కసారిగా పేలింది. దీంతో చిన్నారి మృతిచెందింది.
మహారాష్ట్రలోని ధులే నగరం యశ్వంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నోట్లో బెలూను పేలిపోయి డింపుల్ (8) అనే బాలిక మరణించింది. ఇంటి వద్ద తోటి పిల్లలతో కలిసి బెలూన్లు ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ లో నోటితో డింపుల్ గాలి నింపుతోంది. ఈ క్రమంలో ఆ బెలూన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ వెంటనే డింపుల్ స్పృహతప్పి పడిపోవటంతో స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసింది.
Also Read: నరకానికి తలుపులు.. నరక ద్వారాన్ని గుర్తించిన నాసా
స్థానికుల సమాచారం ప్రకారం.. బెలూన్ పేలిన సమయంలో బెలూన్ ముక్కలు డింపుల్ గొంతులోకి వెళ్లాయి. దీంతో ఊపిరాడక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆ చిన్నారి గాలి పీల్చుకోలేక మరణించింది. బెలూన్ ముక్కలు డింపుల్ శ్వాసనాళంలో చిక్కుకుపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాలిక మరణంతో యశ్వంత్ నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. కళ్లముందే ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి నిమిషాల వ్యవధిలోనే మృత్యువు ఒడిలోకి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.