సేన స్వరం మారింది..రాస్యసభలో పౌరసత్వ బిల్లుకు మద్దతివ్వం

శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు. వాళ్లు కూడా మన పౌరులేనని,ప్రభుత్వం తప్పనిసరిగా వారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని ఉద్దవ్ తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు ఈ బిల్లుకు మద్దతివ్వబోమని తెలిపారు.
అయితే గత రాత్రి లోక్ సభలో పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా శివసేన ఎంపీలు ఓటు వేసిన విషయం తెలిసిందే. లోక్ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశాం కానీ.. బుధవారం రాజ్యసభలో మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ సంకేతాలిచ్చారు. అంటే ఒకే బిల్లుపై ఒకే పార్టీ ఉభయ సభల్లో రెండు రకాలుగా స్పందిస్తుంది.
పౌరసత్వ సవరణ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును సమర్థిస్తున్న వారు భారత మూలాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.