రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ చేశారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులపై రైతులు మండి పడుతున్నారు.15 రోజులుగా ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న మాపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రిపూట ఇళ్లకు వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు… శుక్రవారం సాయంత్రం 5గంటల్లోపు చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్ కు రమ్మని చెప్పటంపట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
సెక్షన్ 307 హత్యాయత్నంతో పాటు మరో 7సెక్షన్ల కింద రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి. చిన్న చిన్న ఘటనలపై హత్యనేరం కింద కేసులు నమోదు చేయటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా గతంలో జరిగిన ఘటనలపై మాత్రం నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. సకల జనుల సమ్మెను అడ్డుకోనే కుట్రలో భాగంగానే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
Also Read : తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ : కొత్త టారిఫ్ ప్రకటించిన ట్రాయ్