తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 01:30 AM IST
తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ

Updated On : March 8, 2020 / 1:30 AM IST

2020-21 వార్షిక సంవత్సర బడ్జెట్‌కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికొద్ది గంటల్లో శాసనసభలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపించకుండా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. 
ఆర్థిక మాద్యం ప్రభావం ఉన్నా.. సంక్షేమ పథకాలపై దాని ప్రభావం పడకుండా బడ్జెట్‌ను రూపొందించే పనిలో ఉంది కేసీఆర్ సర్కార్.

గతేడాది కంటే మెరుగైన బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. దాదాపు లక్షా 60వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను‌‌ ప్రవేశపెట్టబోతోంది. ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన 2020, మార్చి 07వ తేదీ శనివారం నిర్వహించిన భేటీలో బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనలకు కేబినెట్‌‌‌‌‌‌‌‌ ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు శాసనసభలో హరీశ్‌రావు, శాస‌న‌మండ‌లిలో శాస‌న‌స‌భా వ్యవ‌హారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 

ప్రభుత్వ ప్రాధాన్యత‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసిఆర్.. స్వయంగా బ‌డ్జెట్‌పై ప‌లు మార్లు సమీక్ష నిర్వహించారు. ఏ శాఖలకు ఎంతెంత అవసరమో అంత కేటాయింపు చేసినట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌ల తరహాలో ఈ సారి పద్దు కూడా రైతు పక్షపాతిగానే ఉండే అవకాశం ఉంది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, ఇతరత్రా అన్ని రకాల కేటాయింపులు కలిపి బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో 20 శాతానికిపైగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఆసరా పింఛన్ లబ్దిదారుల వయోపరిమితి తగ్గిస్తూ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులు చేసే అవకాశముంది. పింఛన్లకు దాదాపు రూ.10 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవాకాశముంది. కరెంట్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీలు, ఇతర కేటాయింపులకు రూ.10 వేల కోట్ల వరకు ఇస్తారని తెలుస్తోంది. రైతు రుణాలు త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్న నేపథ్యంలో రుణమాఫీకి 6 వేల కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉండే అవకాశముంది. 

రెండో విడ‌త అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఈ బ‌డ్జెట్ లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా దీనిపై శాస‌న‌స‌భ‌లో  నిధుల కేటాయింపుపై సంకేతాలు ఇచ్చారు. అలాగే డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్ల వరకు కేటాయింపులు చేసే అవకాశముంది

ప‌లు కొత్తప‌థ‌కాల కోసం నిధుల కేటాయింపుపై క‌స‌ర‌త్తు చేసిన ప్రభుత్వం బ‌డ్జెట్ ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రేగుతోంది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. సోమ, మంగళవారాలు సభకు విరామం ఇచ్చారు.