హుజూర్‌నగర్ లో త్రిముఖ పోరు : బీజేపీ అభ్యర్ధి కోట రామారావు

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్ దక్కింది. మరోవైపు.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. టీఆర్‌ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.
హుజూర్ నగర్ లో త్రిముఖ పోరు కనపడుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతామని బీజేపీ చెబుతూవచ్చింది. చాలామంది ఆశావహులు పేర్లు వినిపించినప్పటికీ చివరికి బీజేపీ టికెట్ డాక్టర్ కోట రామారావు కు దక్కింది.
మిర్యాలగూడకు చెందిన రామారావు బీజేపీ అనుబంధ సంస్ధలైన ఏబీవీపీ ఆర్.ఎస్.ఎస్ లలోవ క్రమశిక్షణ గలకార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరో వైపు ప్రభుత్వ వైద్యుడిగా కూడా తన సేవలు అందించారు. హుజూర్ నగర్ లో ఉన్న బలమైన బీసీ ఓటు బ్యాంకు ను కొల్లగొట్టేందుకే బీజేపీ కోట రామారావుకు సీటు కేటాయించినట్లు తెలుస్తోంది, అధికార టీఆర్ఎస్ పార్టీ , కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించగా బీజేపీ బీసీ అభ్యర్ధికి కేటాయించింది. ఇక్కడ ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.