డబుల్‌ బెడ్‌రూమ్‌ రాజకీయం.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లలో ఎవరికి ప్రయోజనం

  • Published By: naveen ,Published On : September 22, 2020 / 04:37 PM IST
డబుల్‌ బెడ్‌రూమ్‌ రాజకీయం.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లలో ఎవరికి ప్రయోజనం

Updated On : September 22, 2020 / 4:50 PM IST

రాజకీయాల్లో ఎప్పుడూ, ఎక్కడా కనిపించని అరుదైన దృశ్యం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు కలసి ఒకే అంశాన్ని పట్టుకొని క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వ్యవహారాన్ని టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా చూపించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, దీని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో తెలియదు కానీ…. ప్రజలు మాత్రం హ్యాపీస్‌ అంటున్నారు.

ఫస్ట్ టైమ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ప్రయాణం:
సాధారణంగా అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేదే. కానీ, దానిని ప్రూవ్‌ చేసేందుకు ఇరు పార్టీలు కలసి ముందుకు సాగడం మాత్రం తొలిసారి జరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలసి ప్రయాణం మొదలుపెట్టాయి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ల నేపథ్యంలో ఇరు పార్టీల వ్యవహారం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఎన్నికలప్పుడు డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇస్తామంటూ టీఆర్ఎస్‌ ప్రకటించింది. ఇంతవరకూ అవి పేదలకు ఎందుకు అందలేదు? మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి కాబట్టే హడావుడి చేస్తోందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నించారు.

రెండు లక్షల ఇళ్లు రెడీ:
భట్టి ప్రశ్నకు కౌంటర్‌గా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ రెండు లక్షల ఇళ్లు రెడీగా ఉన్నాయని, కావాలంటే భట్టి విక్రమార్కను తీసుకెళ్ళి వాటిని చూపిస్తానని ప్రకటించారు. అక్కడితో ఆ అంశాన్ని వదిలేయకుండా.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్‌లోని మల్లు భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నారు. ఆయన్ను తీసుకుని నగరంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. వీళ్లిద్దరూ ఒకే కారులో వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఇరువురు నేతల వెంట ఆయా పార్టీలకు చెందిన ఇతర నేతలు కూడా ఉన్నారు.

రాజకీయంగా ప్లస్ అవుతుందని:
నగరంలో చాలా చోట్ల ఇళ్లయితే ఎప్పుడో కట్టారు. కానీ.. వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంలో మాత్రం విపరీతమైన జాప్యం జరిగింది. దీనిపై ఇప్పటికే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటి నుంచో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అసలు నిర్మాణం కూడా జరగలేదనే వారున్నారు. దీంతో అసలు విషయాన్ని బయటపెడితే రాజకీయంగా ప్లస్‌ అవుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయంటున్నారు. అందులో భాగంగా రెండు పార్టీలు ఇళ్ల పరిశీలనకు బయలుదేరాయని చెబుతున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారా?
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన ఇళ్లను ఎన్నికల ముందు పూర్తి చేసి పేదలకు అందించటం ద్వారా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రకటించిన పనులు ముందుకు సాగలేదని, ఇప్పటి వరకూ ఎన్ని ఇళ్లు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేస్తోంది. మరి సింగిల్ టూర్‌తో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో గానీ.. అసలు విషయం బయటపడుతుందని జనాలు అంటున్నారు.

రాజకీయ పార్టీలు సవాళ్లు విసురుకోవడం మామూలే. వాటిని అక్కడి వరకే పరిమితం చేయడం అలవాటే. కానీ, శ్రీనివాస యాదవ్‌, భట్టి విక్రమార్కలు ఒక అడుగు ముందుకేయడం.. దాని వల్ల ప్రజలకు అసలు నిజమేంటో తెలియడం మాత్రం విశేషమేనని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రభుత్వం వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరంపై చర్చ జరిపి, తాము ఏమేమి చేశామో చెప్పుకునే ప్రయత్నం చేసిందంటున్నారు. అదే సమయంలో ఎప్పుడో హామీ ఇచ్చినా ఇప్పటి వరకూ వాటిని నెరవేర్చలేదని ప్రూవ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

క్రెడిట్ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పాకులాట:
ఇప్పుడు ఇళ్లను టీఆర్ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చినా, ఇప్పటి వరకూ ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయిందంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. తమ ఒత్తిడి వల్లే ప్రభుత్వంలో చలనం వచ్చి లబ్ధిదారులకు లాభం జరిగిందని చెప్పుకోవాలని ఆ పార్టీ చూస్తోందని టాక్‌. అదే సమయంలో ఇదంతా తమ క్రెడిట్‌ అని, కాంగ్రెస్‌ ఒత్తిడి చేసినా చేయకపోయినా.. తాము ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ఈలోపు కాంగ్రెస్‌ లేనిపోని హడావుడి చేసిందని ప్రజలకు చెప్పాలని టీఆర్ఎస్‌ భావిస్తోందట.

మొత్తం మీద ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా ప్రజలకు లాభం జరిగేలా ఉండడంతో ఈ వ్యవహారమంతా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.