పోలీసులకు ఫిర్యాదు చేస్తా : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
సదరు నిర్వాహకులకు తనకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి తనను ఎవరూ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఇది ఎవరో కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం సాయంత్రం DMCH స్కూల్ ఆవరణలో జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆత్మీయ విశిష్ట అతిధిగా హాజరవుతారని ఒక ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో పైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలతో కూడిన ఫోటో ఉంది. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం, వైసీపీ , క్రిస్మస్ కమిటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికలో ప్రసంగీకులుగా రెవరెండ్ జక్కల లాల్ బహదూర్ శాస్త్రి (క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్) పేరును ముద్రించారు. ఈ ఆహ్వాన కమిటీలో వెనుక వైపు మరో 21 మంది పేర్లు ప్రచురించారు. అందులో పేర్లన్నిటికీ చివర వైసీపీ నాయకులు తమ తమ హోదాలతో పేర్లు ముద్రించుకున్నారు.