మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క తల్లి 

  • Published By: chvmurthy ,Published On : February 6, 2020 / 03:57 PM IST
మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క తల్లి 

Updated On : February 6, 2020 / 3:57 PM IST

మేడారం జాతరలో కీలకఘట్టం  గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది.  ఫిబ్రవరి6, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు,  ప్రభుత్వ లాంఛనాల మధ్య సమ్మక్క బయలుదేరింది. చిలుకల గుట్ట దిగువన గౌరవ సూచకంగా పోలీసులు, జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. 
 

లక్షలాది మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంచనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. అందరు వనదేవతలు మేడారం గద్దెలపై కొలువుతీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్ లు ఘన స్వాగతం పలికారు. 
 

సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకున్నారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు.  సంప్రదాయ పూజల అనంతరం దర్శనాలు కొనసాగుతున్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. శుక్ర శనివారాల్లో వనదేవతలు గద్దెలపై ఉంటారు.  శనివారం సాయంత్రం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 

 

ప్రతి ఏటా జరిగే మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతోంది. ములుగు జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రానికి గురువారం భక్తులు ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. జంపన్న వాగులో జలకాలాటలు, కోళ్లు, గొర్రెల బలులు, తలనీలాలు.. బంగారు బెల్లం సమర్పణ.. ఇలా వనంలోకి వెళ్లిన జనం భక్తితో పులకించిపోతున్నారు. మేడారం నలుదిక్కులు శివనామస్మరణతో, అమ్మవార్ల భజనలతో మార్మోగిపోతున్నాయి. 

 

బుధవారం నాడు ప్రారంభమైన మహా జాతరలో సారలమ్మ, పగిడిద్ద, గోవింద రాజులు గద్దె పైకి చేరడంతో అద్భుత ఘట్టం పూర్తవగా.. సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న కీలక ఘట్టం నేడు ఆవిష్కృతమయ్యింది. గద్దెపైకి సమ్మక్క చేరే అద్భుత, అపురూప ఘట్టంతో జాతర ప్రాంగణం మరింత శోభాయమానంగా రూపుదిద్దుకుంది.