IND vs NZ : శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో న్యూజిలాండ్ ముందు భార‌త్ ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఉంచింది.

IND vs NZ : శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

Updated On : March 2, 2025 / 6:09 PM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగులు చేసింది. హార్థిక్ పాండ్యా (45; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), అక్ష‌ర్ ప‌టేల్ (42; 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) లు రాణించారు.

కేఎల్ రాహుల్ (23) లు ఫ‌ర్వాలేద‌నిపించాడు. శుభ్‌మ‌న్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11), రోహిత్ శ‌ర్మ (15)లు విఫ‌లం అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. కైల్ జామీసన్, విలియం ఒరూర్కే, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర లు త‌లా ఓ వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ అంచ‌నాల‌ను నిజం చేస్తూ కివీస్ బౌల‌ర్లు చెల‌రేగారు. ఓపెన‌ర్లు గిల్‌, రోహిత్ శ‌ర్మ‌ల‌తో పాటు వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ కోహ్లీ లు సైతం త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. దీంతో భార‌త్ 30 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

IND vs NZ : గ్లెన్ ఫిలిప్స్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. కోహ్లీ ప్యూజులు ఔట్‌.. అనుష్క శ‌ర్మ రియాక్ష‌న్ వైర‌ల్‌..

ఈ ద‌శ‌లో మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి జ‌ట్టును ఆదుకున్నారు. ఈ జోడి తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. కుదురుకున్నాక శ్రేయ‌స్ మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌రలించాడు. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

మ‌రో వైపు అక్ష‌ర్ అత‌డికి చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని అక్ష‌ర్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ర‌చిన్ ర‌వీంద్ర విడ‌గొట్టాడు. అయ్య‌ర్‌-అక్ష‌ర్ జోడి నాలుగో వికెట్‌కు 98 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది.

IND vs NZ : అరుదైన ఘ‌న‌త సాధించిన విరాట్ కోహ్లీ.. సెహ్వాగ్‌, గంభీర్ వంటి దిగ్గ‌జాల వ‌ల్ల కూడా కాలేదు..

అక్ష‌ర్ ఔటైన త‌రువాత రాహుల్‌తో క‌లిసి అయ్య‌ర్ కివీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. శ‌త‌కానికి చేరువైన అత‌డిని విలియం ఒరూర్కే బోల్తా కొట్టించాడు. అయ్య‌ర్‌-రాహుల్ జోడి ఐదో వికెట్ కు 44 ప‌రుగులు జోడించారు. ఈ స‌మ‌యంలో కివీస్ బౌల‌ర్లు విజృంభించ‌డంతో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రాహుల్‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజా (16)లు పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. ఆఖ‌రిలో హార్థిక్ పాండ్యా రాణించ‌డంతో భార‌త్ 250 ప‌రుగుల మార్క్‌కు చేరువ‌గా వ‌చ్చింది.