Champions Trophy 2025 : ఎంఎస్ ధోని కూడా ఏమీ చేయలేడు.. పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించిన పాకిస్తాన్ పై విమర్శల వర్షం కురుస్తోంది

Even MS Dhoni cannot do anything with this Pakistan side says Sana Mir
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు పై సొంత అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాక్ ఆటగాళ్లు ఎంపిక సరిగా లేదని తెలిపింది. ఈ జట్టుకు ధోనిని కెప్టెన్‌గా చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చింది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు(2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్) అందించాడు. అంతేకాదండోయ్ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సైతం అందించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకపోవడం ధోని నైజం. ఆటగాళ్లు విఫలం అయినా సరే అండగా ఉంటూ వారిలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురావడంలో నేర్పరి అన్న సంగతి తెలిసిందే.
‘ఛాంపియన్స్ ట్రోపీకి ఎంపిక అయిన 15 మంది ఆటగాళ్లు ఉన్న పాక్ జట్టుకు ఎంఎస్ ధోని లేదా యూనిస్ ఖాన్ లాంటి వాళ్లను కెప్టెన్‌గా చేసినా.. ఈ జట్టుతో వాళ్లు కూడా ఏమీ సాధించలేరు. పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయలేదు. నేను మ్యాచ్ చూస్తుండగా స్నేహితుడి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. భారత్ స్కోర్ 100/2.. ఉండగా.. మ్యాచ్ చేజారినట్లే అని దాని సారాంశం.’ అని సనా మీర్ చెప్పింది.
ఆ విషయం తనకు జట్టును ఎంపిక చేసినప్పుడే తెలుసునని, భారత్ చేతిలో ఓడిపోతారని తాను ఆ మెసేజ్‌కు జవాబు ఇచ్చినట్లు వెల్లడించింది. దుబాయ్‌లో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అందుకు అనుగుణంగా సరైన జట్టును ఎంపిక చేయలేడంలో సెలక్టర్లు విఫలం అయ్యారు అనే విషయాన్ని సనా ఎత్తి చూపింది.
15 మంది స్వ్కాడ్‌ను ఎంపిక చేసినప్పుడే టోర్నీల్లో సగం మ్యాచ్‌లు ఓడిపోయినట్లే అని అనుకున్నాను. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన గత రెండు సిరీస్‌లలో ఆడిన కీలక ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ తొలగించింది. అని సనా తెలిపింది.