World Cup 2023 Qualifier: వన్డే వరల్డ్ కప్‌కు దూరమైన జింబాబ్వే.. పాక్ అభిమానుల సంబరాలు.. ఎందుకో తెలుసా?

స్కాట్లాండ్ జట్టుపై జింబాబ్వే ఓటమితో సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ అభిమానులు సందడి చేసుకుంటున్నారు. మీమ్స్‌తో చెలరేగి పోతున్నారు.

World Cup 2023 Qualifier: వన్డే వరల్డ్ కప్‌కు దూరమైన జింబాబ్వే.. పాక్ అభిమానుల సంబరాలు.. ఎందుకో తెలుసా?

Pak and Zimbabwe Captains (File Photo)

Updated On : July 5, 2023 / 1:41 PM IST

World Cup 2023 Qualifier: ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌( ICC ODI World Cup 2023) కు జింబాబ్వే (Zimbabwe)  అర్హత సాధించలేక పోయింది. మంగళవారం స్కాట్లాండ్‌ (Scotland) తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ సూపర్ -6 తొలి మ్యాచ్‌లో ఒమన్ జట్టును ఓడించిన జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. తాజాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ జట్టుపై ఓడిపోవటంతో మెగా టోర్నీకి అర్హత సాధించలేక పోయింది. జింబాబ్వే ఓటమితో సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ అభిమానులు సందడి చేసుకుంటున్నారు. మీమ్స్‌తో చెలరేగి పోతున్నారు. అయితే, జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోతే పాకిస్థాన్ అభిమానులు సంబరాలు చేసుకోవటం ఏమిటని మీకు డౌట్ రావొచ్చు. ఇందుకు ఓ కారణం ఉంది.

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న జింబాబ్వే.. ఆ రెండు జట్లలో మెగా టోర్నీకి వచ్చేదెవరు?

2022 అక్టోబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టుపై పాకిస్థాన్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ సమయంలో పాకిస్థాన్‌పై జింబాబ్వే జట్టు అభిమానులు మీమ్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఈసారి ‘అసలైన మిస్టర్ బీన్’ను పంపాలంటూ ట్రోల్ చేశారు. జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ కూడా ‘ జింబాబ్వే విజయం అద్భుతం.. అభినందనలు.. వచ్చేసారి నిజమైన మిస్టర్ బీన్‌ను పంపండి అంటూ పాకిస్థాన్ ప్రధానిని వెక్కిరిస్తూ ట్వీట్ చేశారు. దీనికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌సైతం స్పందించి జింబాబ్వే అధ్యక్షుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.. మా వద్ద అసలైన మిస్టర్ బీన్ ఉండకపోవచ్చు. కానీ, మా వద్ద అసలైన క్రికెట్ స్ఫూర్తి ఉంది అంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ‘మిస్టర్ బీన్’ పేరుతో సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది.

Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్

అప్పటి నుంచి జింబాబ్వేపై కసితీర్చుకోవాలని పాక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా జింబాబ్వే వన్డే ప్రపంచ వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేక పోవటంతో పాక్ అభిమానులు మీమ్స్‌తో సోషల్ మీడియా వేదికగా జింబాబ్వే జట్టును హేళన చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంతకీ ‘మిస్టర్ బీన్’ వివాదం ఏమిటంటే.. 2016లో జింబాబ్వేలో కామెడీ షోలు నిర్వహించేందుకు మిస్టర్ బీన్‌ను పోలిఉన్న పాక్ హాస్య నటుడు ఆసీఫ్ మహమ్మద్‌ను షో నిర్వాహకులు ఆహ్వానించారు. అతడు నిజమైన మిస్టర్ బీన్ ను పోలి ఉంటాడు. జింబాబ్వే రాజధాని హరారేలో నిర్వహించిన షోలో అతడు సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేక పోయాడు. దీంతో చాలా మంది ప్రోగ్రాం మధ్యలోనే వెళ్లిపోయారు. చాలా మంది జింబాబ్వే ప్రజలు అతడు అసలైన మిస్టర్ బీన్ గా భావించి ప్రదర్శన టికెట్లు కొన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో ఫేక్ మిస్టర్ బీన్ జింబాబ్వే వీధుల్లో పర్యటనకు పోలీసులు రక్షణ కూడా కల్పించారు.