Gossip Garage : ఏడాది అవుతున్నా అదే సాగదీత.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి అసలు కారణం అదేనా?

క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది.

Gossip Garage : ఏడాది అవుతున్నా అదే సాగదీత.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి అసలు కారణం అదేనా?

CM Revanth Reddy

Updated On : December 13, 2024 / 12:24 AM IST

Gossip Garage : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్‌గా మారింది. సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళ్తున్నారు.. వస్తున్నారు.. పండుగలు వస్తున్నాయి.. పోతున్నాయి. మూఢాలు చెదిరిపోతున్నాయి. శుభ ముహూర్తాలు కరిగిపోతున్నాయి. ఏడాది నుంచి అదే తంతూ. ఇదిగో అదిగో అంటూ ఆశ పెడుతున్నారే తప్పా.. విస్తరణ అయ్యింది లేదు. పదవులు వచ్చింది లేదు. ఐతే ఏడాది నుంచి హైకమాండ్ వాయిదాల జపం చేయడానికి రీజన్‌ వేరే ఉందంట.. ఇంతకీ ఆ రీజనేంటి..

అసలు విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. అప్పటి నుంచి బుగ్గ కారు కోసం కొందరు నేతలు కంట్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఏదో శుభవార్త తెస్తారని ఎదురుచూడడం.. ఢిల్లీ నుంచి వచ్చి విస్తవరణపై పెదవి విప్పకపోవడంతో డీలా పడిపోవడం సర్వ సాధారణమైపోయింది. ఈ నిశబ్ధ వాతావరణంతో కొండంత ఆశ‌ పెట్టుకున్న ఆశావహుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. అసలు విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? అంటూ గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యేలు.

ఏడాది పూర్తైనా అదే సాగదీత..
గ‌తేడాది డిసెంబ‌ర్ 7న సీఎంగా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి..త‌న‌తో పాటు 11మందితో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి క్యాబినెట్‌ విస్తర‌ణ ఊరిస్తూనే ఉంది. నెలలు గడుస్తున్నా విస్తర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్‌లో అదనంగా మ‌రో ఆరుగురికి చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం.. ప‌దుల సార్లు.. అధిష్టానంతో చ‌ర్చోప చ‌ర్చలు.. మంత‌నాలు జ‌రిగాయి. ఏడాది పూర్తైనా అదే సాగదీత.. అదే ఊరడింపు..

దీపావ‌ళికి పక్కా అంటూ ఊరడించి ఊసురుమనిపించారు..
సంక్రాంతికి అన్నారు. అంతలోనే ఉగాది తర్వాత చూద్దామన్నారు. ఇంతలోనే ఆషాఢ మాసం తెర‌పైకి వ‌చ్చింది. అది పోగానే లోక్‌స‌భ ఎన్నిక‌లు అడ్డొచ్చాయి. కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త‌ర్వాత‌.. విస్తర‌ణ ప‌క్కా అంటూ ప్రచారం జ‌రిగింది. చెప్పిన‌ట్లుగానే పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్‌ కుమార్ గౌడ్ నియామ‌కం పూర్తి చేసింది. ఇక అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ద‌సరా పండుగ‌కు కొత్త మంత్రులు వ‌స్తార‌ని అధిష్టానం లీకులు ఇచ్చింది. కానీ ఆ లీకులకు అధిష్టానం పోకడలకు పొంతన లేదు. మొన్నటికి మొన్న దీపావ‌ళికి పక్కా అంటూ ఊరడించి ఊసురుమనిపించారు అధిష్టానం పెద్దలు. ఇంతలోనే మ‌హారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నిక‌లు రాగానే మళ్లీ ఢిల్లీ పెద్దలు సైలెంట్ అయ్యారు. ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఐనా క్యాబినెట్ విస్తరణపై నో క్లారిటీ.

మంత్రి పదవుల కోసం భారీ పోటీ..
మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఆశావహులు కొండంత ఆశ పెట్టుకున్నారు. అందులో మాజీ మంత్రులతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు, జూనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరి లెవల్ లో వారు పైరవీలు చేసుకుంటూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధిష్టానం వరకు విన్నపాలు చేసుకుంటున్నారు. దీంతో క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ్రీనివాస్‌, వివేక్‌ వెంకట స్వామి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల మరో 7 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే ఒకరిద్దరు నేతలకు కూడా మంత్రివర్గంలో పదవి ఆశిస్తున్నారు. ఈ జాబితాలో షబ్బీర్‌ అలీ, పహీం ఖురేషీ పేర్లు వినిపిస్తున్నాయి.

కేబినెట్‌ బెర్త్‌లు ఆరు ఖాళీ ఉంటే పోటీ పడుతున్న నేతల సంఖ్య పదికి పైగా ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలకు బిగ్‌ టాస్క్‌గా మారిందట. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోందని తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఒక్కటే.. అనుకున్న శాఖలు రాకున్నా.. మంత్రి పదవి దక్కకున్నా అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశముంది. అందుకే ఎప్పటికికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోందని ఆ పార్టీ ఇన్‌సైడ్‌ టాక్‌..

లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని వాయిదాల జపం..
అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రుల సిఫారసులు కూడా హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయంట.. కొందరు కర్ణాటక సర్కార్ పెద్దలతో కూడా సిఫార్సులు చేయిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి రికమండేషన్‌ను పరిగణలోకి తీసుకోవాలో తెలియక హైకమాండ్‌ పెద్దలు అయోమయంలో పడ్డారనేది కాంగ్రెస్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న చర్చ.. విభేదాలు, అలకలు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణ చేసి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ఢిల్లీ పెద్దలు వాయిదాల జపం చేస్తున్నారు. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని మంత్రి పదవుల ఆశావహులు గుర్రుగా ఉన్నారంట.. మరి హైకమాండ్‌ ఏం చేస్తుంది, ఈ సారైనా సీఎం హస్తిన టూర్‌ తీపి కబురుతో ముగుస్తుందో లేదో చూడాలి.

 

Also Read : గోరటి వెంకన్నకు నజరానా వెనక సీఎం రేవంత్ ప్లాన్ అదేనా?