ప్రేమంటే ఇదేనా? : ప్రేయసి కోసం చెట్టుకు ఉరేసుకుని.. సమాధి వద్దే!

Man Commits Suicide for Girlfriend: ప్రేమంటే ప్రాణం ఇవ్వడం.. ప్రేమించడం అంటే ఒకరు లేకుండా మరొకరు ఉండలేకపోవడం అంటారు కదా? అదే మాటలను నిజం చేశాడు ఓ యువకుడు. ప్రేమంటే ఫాలోయింగ్‌లు, గంటలకొద్దీ మాట్లాడుకోవడం, సరదాలు, షికార్లే కాదు ప్రేమంటే ప్రాణం ఇచ్చేంత తెగింపు.. ఆత్మహత్య చేసుకునేంత బలహీనత అన్నట్లుగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుడురుపల్లిలో ప్రియురాలు చనిపోయింది అనే బాధలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రియురాలి లేని జీవితం వ్యర్థం అనుకుని, ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి అనారోగ్యంతో చనిపోతే జీర్ణించుకోలేక.. తీవ్ర మనస్తాపానికి గురై ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరే మహేష్.. కొన్నేళ్లుగా గీతాంజలి అనే ఓ యువతిని ప్రేమిస్తున్న అతను.. ఆమెను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. ఇంతలో ఆ యువతి అనారోగ్యంతో మృతి చెందింది.
అప్పటి నుంచి మహేష్ ఆమె ఆలోచనలతోనే గడుపుతున్నాడు. చివరకు యువతి సమాధి వద్దే చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఆమె లేని లోకంలో తాను ఉండలేనంటూ ఆత్మహత్యకు ముందు మహేష్ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.
కాగా, మహేష్ పెట్టిన స్టేటస్ చూసిన స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకునేసరికి.. మహేష్ చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకుని మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా.. ప్రేమించిన అమ్మాయి మృతిని తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మహేష్ తండ్రి పోలీసులకు వెల్లడించాడు.