అందుకే పవన్ కల్యాణ్‌కి చిరంజీవి విరాళం ఇచ్చారు: పోసాని కృష్ణ మురళీ

Posani Krishna Murali: రాష్ట్రానికి పురందేశ్వరి లేడీ విలన్‌లా తయారయ్యారని అన్నారు.

అందుకే పవన్ కల్యాణ్‌కి చిరంజీవి విరాళం ఇచ్చారు: పోసాని కృష్ణ మురళీ

Posani Krishna Murali

Updated On : April 10, 2024 / 4:37 PM IST

Posani Krishna Murali : తమ్ముడు మంచివాడు అనుకుని చిరంజీవి విరాళం ఇచ్చారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ అన్నారు. పవన్ కల్యాణ్‌కు చిరంజీవి విరాళం ఇచ్చేలోపు జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళా వాలంటీర్లను పవన్ కల్యాణ్ నీచంగా అవమానించారని చెప్పారు. 2 లక్షల పుస్తకాలు చదివానని పవన్ అంటారని, దానికి ప్రతిఫలం ఇదేనా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మానసిక రోగి అని విమర్శించారు.

టీడీపీ నేత నారా లోకేశ్‌లా వాలంటీర్లు తాగుబోతు, తిరుగుబోతులు కాదంటూ కృష్ణమురళీ విమర్శలు గుప్పించారు. అమరావతిలో పోసాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు చింతించాల్సిన పనిలేదని చెప్పారు.

చంద్రబాబు రూ.10 వేలు ఇస్తానని చెబుతుంటే వాలంటీర్లు నమ్మరని అన్నారు. 2014లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి నెరవేర్చలేదని చెప్పారు. తాను జగన్ క్యారెక్టర్ చూసి ఆయనను అభిమానిస్తున్నానని తెలిపారు. చంద్రబాబుది చెడ్డ క్యారెక్టర్ కనుకే తిడుతున్నానని అన్నారు.

కమ్మ సామాజిక వర్గానికి కష్టం వస్తే చంద్రబాబు ఎన్నడూ స్పందించలేదని పోసాని తెలిపారు. పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా చంద్రబాబు కోసం పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి పురందేశ్వరి లేడీ విలన్‌లా తయారయ్యారని అన్నారు. దొంగలు అందరూ ఒక్కటయ్యారని, జగన్ ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు.

Also Read: ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి