మధ్యప్రదేశ్‌లో కుప్పకూలనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అమిత్ షాతో కలసి మోడీతో సింధియా మంతనాలు

బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవారం అర్ధరాత్రి నుంచి మొదలైన హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది.
జ్యోతిరాదిత్య సింధియాకు కనీసం11 మంది ఎమ్మెల్యే మద్దతుంది. ఆరుగురు మంత్రులూ ఆయన వెంటున్నారు. వారితో కలసి సింధియా బీజేపీలో చేరితే కమలానికే అధికారమొస్తుంది. ఒకవేళ అసమ్మతి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా సభలో బలం తగ్గుతుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సిద్ధమైంది. అంటే… సరైన బలం లేక ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంలాగే కనిపిస్తోంది.
అసంతృప్త సింధియాను ఒప్పించి అధికారాన్ని కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం ఎంపీ కాంగ్రెస్ నేత పి.సి.శర్మకూడా సింధియాను తిరిగి గూటిలోకి తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేదీలేదు. కమల్ నాథ్ ప్రభుత్వం కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ప్రదర్శించినా, బీజేపీ వ్యూహలను తట్టుకోవడం కాంగ్రెస్ వల్ల కావడం లేదు.
నిజానికి, మధ్యప్రదేశ్ లో బీజేపీదే పైచేయి. మహారాష్ట్ర భంగపాటు కళ్లెదురుగా ఉంది కాబట్టి, ఇంకోసారి పరువుపోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే అమిత్ షా, సింధియాను మోడీ దగ్గరకు తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్ లో బలాబలాలు: మొత్తం సీట్లు 228, కాంగ్రెస్ బలం 114 సీట్లు. సరిగ్గా సమం. పూర్తిగా మెజార్టీలేదు. నిజానికి మొత్తం అసెంబ్లీ సీట్లు 230. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో సీట్ల సంఖ్య 228కి తగ్గిపోయింది. కాంగ్రెస్ కు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బిఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యే మద్దతుంది. బీజేపీకి ఉన్న బలం 109 సీట్లు.
మంగళవారమే జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మధవరావు 75వ జయంతి. కాంగ్రెస్ పార్టీలో తండ్రి కీలక నేత. కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఆయన గురించి గొప్పగానే చెప్పుకొంటోంది. అలాంటిది ఆయన జయంతి రోజునే కొడుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు.
మరోవైపు బీజేపీ భోపాల్ లో సమావేశమై అన్నిలెక్కలు సరిగా వేసుకొంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చినట్లు కాకుండా, అంతర్గత కుమ్ములాటల వల్లే కుప్పకూలినట్లు కనిపించేలా అన్ని ఎత్తుగడలు వేస్తున్నారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమార్ అక్కడే ఉండి అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆయన ఇంతకు ముందే హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లను కలిశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని విజయవంతంగా కుప్పకూల్చే ఏర్పాట్లలో ఉన్నారు.
See Also | మాస్క్ లు అధిక ధరలకు విక్రయించినందుకు రూ.20 వేల ఫైన్