వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2019 / 10:17 AM IST
వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనను తాను కాంగ్రెస్‌ సైనికురాలిగా తెలుపుతూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు ప్రియాంక ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె తెలిపారు.యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉంది. దీనివల్ల మహిళలు, చిన్నారులు, యువత.. సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వారు మనతో తమ పరిస్థితులను చెప్పుకోవాలని భావిస్తున్నారు. కానీ, రాజకీయ కుయుక్తుల కారణంగా, రాష్ట్ర విధానాల వల్ల చెప్పుకోలేకపోతున్నారు. ప్రజల పరిస్థితులను అర్థం చేసుకోనంత వరకు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేను మీతో నేరుగా సంప్రదింపులు జరపడానికి వస్తున్నాను. మీతో మాట్లాడిన తర్వాత, మేము రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తామని మీకు హామీ ఇస్తున్నాను’ అని ఆమె తెలిపారు.

మంగళవారం(మార్చి-19,2019) నుంచి మూడు రోజుల పాటు స్టీమర్‌ బోట్‌ ద్వారా ‘గంగా యాత్ర’ చేపట్టనున్నారు. గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మొత్తం 140 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రయాగ్‌ రాజ్‌ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్‌ వరకు ఈ యాత్ర జరగనుంది. ఆ ప్రాంతాల ప్రజలతో సమావేశం అయి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు.