పైచేయి ఎవరిది.. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బాపూరావుల మధ్య ఆధిపత్య పోరు

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 05:25 PM IST
పైచేయి ఎవరిది.. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బాపూరావుల మధ్య ఆధిపత్య పోరు

Updated On : October 6, 2020 / 5:39 PM IST

soyam bapurao vs rathod bapurao: ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్యలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుల మధ్య పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాథోడ్ నిదానంగా కనిపించే వ్యక్తి. బీజేపీ సోయం బాపూరావు దూకుడు స్వభావం కలిగిన నాయకుడు. బోథ్ ప్రాంతానికి చెందిన సోయం 2004లో టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 తర్వాత కేసీఆర్‌తో విభేదాలు, ఇతర కారణాలతో పార్టీ మారారు. 2009లో పొత్తులలో బోథ్ నుంచి టీడీపీ అభ్యర్థి గోడెం నగేశ్‌ గెలుపొందారు. అప్పుడే రాథోడ్ బాపూరావు టీఆర్ఎస్‌లో చేరారు.

బీజేపీలో చేరి అనూహ్యంగా గెలిచారు:
2009 నుంచి టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉంటున్నారు రాథోడ్‌ బాపూరావు. 2014లో టీఆర్ఎస్ బోథ్ టికెట్ రాథోడ్ బాపూరావుకు దక్కింది. ఆ ఎన్నికల్లో రాథోడ్ గెలుపొందారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సోయం బాపురావు టికెట్ తెచ్చుకోని పోటీ చేసినా ఓడిపోయారు. 2019 జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోయం బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా గెలిచారు. బీజేపీకి ఈ ప్రాంతంలో బలం తీసుకువచ్చారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై మాటలతో విరుచుకుపడంతో ఇతర పార్టీ నేతలు సైతం కాస్త డైలమాలో పడ్డారు.

బోథ్‌లో పార్టీ బలోపేతానికి సోయం పావులు:
మరోపక్క, బోథ్ నియోజకవర్గంపై కూడా ఎంపీ సోయం దృష్టి సారించారట. తన సొంత నియోజకవర్గమైన బోథ్‌లో పార్టీ బలోపేతానికి సోయం పావులు కదులుతున్నారట. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా బీజేపీని ఈ ప్రాంతంలో ఎదగనిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. సోయంను ఢీ అంటే ఢీ అనేలా ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరూ పావులు కదుపుతున్నారు. కేడర్ పెంచుకోవడానికి ఒకరు ప్రయత్నం చేస్తే, ఉన్న కేడర్‌ను కాపాడుకునే పనిలో మరొకరున్నారు.

ఆధిపత్యం ఎవరికి దక్కుతుందో:
ఈ ఇద్దరు బాపూరావులు కూడా రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసిన వారే. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. కానీ ఒకరు గోండు, మరొకరు లంబాడా వర్గానికి చెందిన వారు. తమ సామాజిక వర్గాల ఆధారంగా కార్యకర్తలను పెంచుకునేలా పావులు కదుపుతున్నారట. రానున్న రోజుల్లో వీరిద్దరూ మరోసారి ఢీకొనే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే పట్టు కోసం పోరాటం మొదలు పెట్టారని చెబుతున్నారు. వీరిద్దరిలో ఆధిపత్యం ఎవరికి దక్కుతుందో.. ఎవరి వెంట ప్రజలు నిలుస్తారో చూడాలి.