మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి

CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వర్షాలు రైతన్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. రైతాంగాన్ని ఆదుకునేందుకు సహకారించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.
ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలో మంచి వర్షాలు కురవడంతో పంటల సాగు రికార్డు స్థాయిలో అయ్యాయి. ప్రభుత్వం అంచనాలను మించి పంటలు సాగయ్యాయి. సాధారణంగా రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని తెలంగాణ సర్కార్ వేసిన అంచనాలు సైతం తలకిందులయ్యాయి. రాష్ట్రంలో ఏకంగా కోటి 34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి.
అయితే వానాకాలం ప్రారంభం నుంచి వర్షాలు గ్యాప్ లేకుండా కురుస్తున్నాయి. ఏకంగా సాధారణ వర్షపాతం కంటే 50 శాతం పైగా అధికంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరీ ముఖ్యంగా రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. లక్షలాది ఎకరాల్లో వరి పంట కోత దశలో పూర్తిగా దెబ్బతింది.
ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబగద్వాల్, సిద్ధిపేట జిల్లాల్లో పంటలు విపరీతంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వరితో పాటు పత్తి, సోయా, కూరగాయల పంటలకు బాగా నష్టం చేకూరినట్లు గుర్తించారు.
అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన 18లక్షల మెట్రిక్ టన్నుల పత్తి నీటిపాలైనట్లు తెలుస్తోంది. అన్ని పంటలూ కలిపి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. రైతులకు సాయం చేసేందుకు రూ.600 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ కోరారు. మరోవైపు పూర్తిగా నష్టపోయిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.