Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. చివరి రోజు వాడీవేడిగా సాగిన సమావేశాలు..

ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్ లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. చివరి రోజు వాడీవేడిగా సాగిన సమావేశాలు..

Updated On : December 21, 2024 / 9:10 PM IST

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 7 రోజుల పాటు శాసన సభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. అటు 4 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఓవరాల్ గా 37.44 గంటల పాటు సమావేశాలు కొనసాగాయి. ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్ లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. మొదటి రోజు నుంచే అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. తొలి రోజు అదానీ, రేవంత్ దోస్తానా అంటూ బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలిపింది. ఆ తర్వాత వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు.. తర్వాత కంటిన్యూగా నడిచాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున 8 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 3 షార్ట్ డిస్కషన్లపై సభలో చర్చ జరిగింది.

ప్రధానంగా ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి రోజు మాత్రమే ఎక్కువగా ప్రసంగించారు. కీలకమైన అన్ని అంశాలను ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సంబంధిత చర్చలో పాల్గొన్నారు. ఓవరాల్ గా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలను, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిస్థితులను పూర్తి స్థాయిలో సభలో వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పిదాల వల్ల తమ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాపోయారు.

నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆధారంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఓవరాల్ సభలో ప్రతీ అంశం కూడా వాడీవేడిగా జరిగింది. వారం రోజులు జరిగిన సభలో ఇవాళ మినహా బీఆర్ఎస్ పార్టీ ప్రతి రోజు అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించిందని చెప్పొచ్చు.

ఇక చివరి రోజు సమావేశాల్లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, సినీ పరిశ్రమ, అల్లు అర్జున్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చెరిగారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో చివరి రోజు సమావేశాల్లో ఈ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్, సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఇకపై తెలంగాణలో తాను సీఎంగా ఉన్నంతవరకు సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. దీంతో టాలీవుడ్ షాక్ లో ఉండిపోయింది.

Also Read : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?