Cyclone Fengal : ముంచుకొస్తున్న ఫెంగల్.. ఏపీకి భారీ వర్ష సూచన..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాన్ ఎంత మేర బీభత్సం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Cyclone Fengal (Photo Credit : Google)
Cyclone Fengal : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మరికొన్ని గంటల్లో తుపానుగా మారబోతున్నట్లుగా ఐఎండీ హెచ్చరించింది. దీనికి ఫెంగాల్ తుపానుగా వాతావరణ శాఖ నామకరణం చేసింది. ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఐఎండీ కీలక హెచ్చరికలు చేయగా, తుపాను ముప్పు ఏ మేర ప్రభావం చూపుతుందోనని రైతులు హడలిపోతున్నారు.
ఫెంగాల్ తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఈ నెల 29న మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫెంగాల్ తుఫాన్ ఎంత మేర బీభత్సం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
”ఈ నెల 27 నాటికి వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉంది. తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటే అవకాశముంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. తుపాను కారణంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పంట ఉత్పత్తులను వర్షం నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని అధికారులు హెచ్చరించారు.
Also Read : సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం