టీడీపీ గూటికి గౌరు కుటుంబం

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 03:11 PM IST
టీడీపీ గూటికి గౌరు కుటుంబం

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న గౌరు దంపతులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరు దంపతులకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గౌరు చరితారెడ్డితో పాటు పలువురు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఈ సంధర్భంగా కేసీ కెనాల్ కింద సాగుభూములకు రెండు పంటలకు నీరందించే ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబుకు గౌరు చరితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 
రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తులైన గౌరు కుటుంబం పార్టీకి దూరం అవడం వైసీపీకి పెద్ద షాక్‌గా చెప్పుకోవచ్చు.  గతంలో జైలు శిక్ష పడిన గౌరు వెంకటరెడ్డిని.. తను ముఖ్యమంత్రి అయ్యాక క్షమాభిక్ష ఇప్పించి రాజశేఖర్ రెడ్డి విడుదల చేయించారు. అందుకే ఆ తర్వాత వారు జగన్ వెంట నడిచారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గౌరు వెంకటరెడ్డి వ్యవహరించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత శిల్పా సోదరులు వైసీపీలో చేరారు. ఓ వైపు తమకు ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం మరో వైపు శిల్పా సోదరులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వారు పార్టీ మారారు.