భారత్‌లో 6లక్షలకు చేరువలో కరోనా కేసులు, 17వేలు దాటిన మరణాలు

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి రికార్డు స్తాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18వేల 653 కొత్త కేసులు, 507 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 85వేల 439కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య 17వేల 400కి పెరిగింది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
యాక్టివ్ కేసులు 2లక్షలు, రికవరీ కేసులు 3లక్షలు:
జూన్ 30వ తేదీ వరకు 86లక్షల 26వేల 585 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న(జూన్ 30,2020) ఒక్కరోజే 2లక్షల 17వేల 931మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 20వేల 114. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 47వేల 979. తమిళనాడు రాష్ట్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఇప్పటివరకు 90వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
కొన్ని రోజులుగా దేశంలో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు:
కొన్ని రోజులుగా దేశంలో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. కాగా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం దాదాపు 60కి చేరడం కాస్త ఊరట కలిగించే విషయం. అయితే, దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు.
ఒక్క జూన్ నెలలోనే 4లక్షల కేసులు, 12వేల మరణాలు:
దేశవ్యాప్తంగా జూన్ నెలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జూన్ 1 తేదీ నాటికి దేశంలో 1,90,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 5లక్షల 85వేలకు చేరింది. దీంతో కేవలం జూన్ నెలలోనే 3లక్షల 94వేల 958 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక మరణాల సంఖ్య జూన్ 1న 5394గా ఉండగా, జూన్ 30నాటికి 17వేలు దాటింది. ఈ నెల రోజుల సమయంలోనే దేశంలో 12వేల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పది రాష్ట్రాల్లోనే 90శాతం కేసులు:
దేశంలో కేవలం పది రాష్ట్రాల్లోనే కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా కొవిడ్19 తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు లక్షా 74వేల 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7వేల 855మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. తాజాగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 90వేలు దాటింది. వీరిలో ఇప్పటివరకు 1,201మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 87వేల 360కి చేరగా 2వేల 742మంది చనిపోయారు. గుజరాత్‌లోనూ కొవిడ్ మరణాల సంఖ్య 1846కి చేరింది.
Read:కరోనా వ్యాక్సిన్ వస్తే తొలుత వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పున్న ప్రజలకు