టీఆర్ఎస్ కుట్ర: తెలంగాణ పోలీసులే చోరీ చేశారు

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 10:13 AM IST
టీఆర్ఎస్ కుట్ర: తెలంగాణ పోలీసులే చోరీ చేశారు

Updated On : March 6, 2019 / 10:13 AM IST

ఏపీలో తెదేపా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 54 లక్షల ఓట్లను తొలగించాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసేలా జగన్‌ ప్రవర్తిస్తున్నారని, ఈసీ పనితీరునే జగన్ తప్పుపడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో డేటా మొత్తం చోరీ చేశారని, ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పార్టీ డేటా నిక్షిప్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌కు వర్సిటైల్‌ మొబిటెక్‌ సంస్థ ఉందని, కానీ ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. వైసీపీ-టీఆర్‌ఎస్ కలిసి పార్టీ డేటా, సేవామిత్రల డేటాను దొంగిలించడం నేరమని, కుట్రలో భాగస్వాములపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
ఈ మొత్తం వ్యవహారానికి బీజేపీ నేతలే సలహాదారులని, ఈ కుట్రను తెలంగాణలో బీజేపీ నేతలు సమర్థిస్తున్నారని, ఏపీలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర వ్యవహారాల్లో మరో రాష్ట్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, డేటా చోరీ విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ నేతల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా డేటాను తెలంగాణ పోలీసులు చోరీ చేశారని, ఎన్నికల్లో గందరగోళాలు సృష్టించి చంద్రబాబును ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. తెల్ల కాగితాలపై సంతకాలు చూసి హైకోర్టు చీవాట్లు పెట్టిందంటూ కనకమేడల గుర్తు చేశారు.