టీడీపీ, వైసీపీ నేతలు అందుకే వెళ్లారా : బీజేపీ నేత కొడుకు నిశ్చితార్థ వేడుకపై రాజకీయ రచ్చ
ఆకాశమంత పందిరి వేశారు... భూదేవంత మండపం వేశారు... అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా... దానికి హాజరైన అతిథుల

ఆకాశమంత పందిరి వేశారు… భూదేవంత మండపం వేశారు… అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా… దానికి హాజరైన అతిథుల
ఆకాశమంత పందిరి వేశారు… భూదేవంత మండపం వేశారు… అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా… దానికి హాజరైన అతిథుల గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ మార్పులకు ఆ వేడుకను వేదికగా మార్చేశారని విమర్శిస్తున్నారు. ఇంతకీ.. ఆ నిశ్చితార్థం ఎవరిది? దానిపై ఎందుకింత రాజకీయ రచ్చ మొదలైంది?
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్‌లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఇండియా నుంచి తరలివెళ్లిన అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇందులో టీడీపీ, వైసీపీతోపాటు దేశంలోని పలుపార్టీల ఎంపీలు కూడా ఉన్నారు.
ఏకంగా 17 ప్రత్యేక విమానాల్లో అతిథులను దుబాయ్ తరలించిన సీఎం రమేశ్… అక్కడ వారికి మర్చిపోలేని అతిథ్యమిచ్చారు. దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి మరీ స్వాగతం పలికారు. అయితే.. రెండు కుటుంబాలకు పరిమితమైన ఈ ఫంక్షన్‌కు అన్ని పార్టీల లీడర్లు హాజరవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టీడీపీ, వైసీపీ నేతలకు వల వేయడానికి బీజేపీ… ఈ నిశ్చితార్థ వేడుకను ఉపయోగించుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ సందర్భంగా.. బీజేపీలో చేరే విషయమై చర్చించారనే టాక్ వినిపిస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని సీఎం రమేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని బలపరుస్తున్నాయని చెబుతున్నారు.
రాజకీయ నేతల ఇళ్లలో జరిగే వేడుకల్లో పార్టీలకతీతంగా నాయకులు పాల్గొనడం సహజం. కానీ ఆపరేషన్ కమలం నేపథ్యంలో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దుబాయ్‌లో నిశ్చితార్థం నిర్వహించడం, నేతలంతా రెండు మూడు రోజులపాటు దుబాయ్‌లోనే మకాం వేయడంతో ఈ అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. వ్యక్తిగతంగా సీఎం రమేశ్‌కున్న పరిచయాలను బట్టే అతిథులను ఆహ్వానించారని.. ఈ కార్యక్రమంలో రాజకీయాలను ప్రస్తావించే అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థం.. వ్యక్తిగతం కంటే.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.