వారసులు గట్టేక్కేనా 

  • Published By: chvmurthy ,Published On : April 21, 2019 / 01:38 AM IST
వారసులు గట్టేక్కేనా 

Updated On : April 21, 2019 / 1:38 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో యువరక్తం ఉరకలెత్తింది. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఏళ్ల తరబడిగా పార్టీని భుజస్కందాలపై మోసిన సీనియర్లు… ఇప్పుడు తమ బిడ్డల్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధినేతతో కొట్లాడి మరీ ఎన్నికల్లో టికెట్లు సాధించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. పోలింగ్‌ ముగిసినప్పట్నుంచీ చాలామంది నేతల్లో టెన్షన్‌ పీక్ స్టేజ్‌కి చేరింది. తమ వారసులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వారిని ప్రశాంతంగా నిద్ర పోనివ్వడం లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని మొదట్లో టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ వీరిలో ఎక్కువ మంది సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. అలా అని వీరినే నిలబడితే పార్టీ ఓటమి ఖాయమని చంద్రబాబు అంచనాకొచ్చారు. మధ్యేమార్గంగా వారి వారసులను రంగంలో దించారు. అసెంబ్లీకి 15 మందిని, పార్లమెంటుకు ఐదుగురు వారసులను బరిలో నిలబెట్టారు. అయితే ఎక్కువచోట్ల ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, వారి వారసుల పై కూడా పడిందని పార్టీ హైకమాండ్‌కి సమాచారం వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయా సీనియర్ నేతలందరికీ టెన్షన్ మొదలైంది. ఫలితాలు రావటానికి ఇంకా నెలపైన సమయం ఉన్నప్పటికీ కూడికలు తీసివేతలతో కాలం గడుపుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాను చూస్తే పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీష పోటీ చేశారు. శివాజీ ఈ ప్రాంతంలో టిడిపి స్థాపించినప్పటి నుంచి 2009 మినహా అన్ని ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే విజయనగరం అసెంబ్లీ నుంచి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేశారు. కుమార్తెల గెలుపు బాధ్యతలను తండ్రులు భుజాన వేసుకున్నారు. అశోక్ గజపతిరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను తప్పించి సైతం తన కుమార్తెకు సీట్ సాధించుకున్నారు. రాజమండ్రి సిటీ నుంచి దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ గెలుపు కూడా అంత ఈజీ కాదని పార్టీ నేతలు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పెడనలో సీనియర్ నేత కాగిత వెంకట్రావు తన వారసుడు కృష్ణప్రసాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నుంచి జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌ను రంగంలోకి దించారు. ఇప్పుడు వీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఈ నేతలంతా గెలుపుకు ఎదురీదుతున్నారని పార్టీ హైకమాండ్‌కి సమాచారం వచ్చింది. గుడివాడ నుండి దేవినేని అవినాష్ పోల్ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని ఆయన గెలిచే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిని అవినాష్ గట్టిగా ఢీకొట్టారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతుంది.

మరోవైపు శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన మధుసూదన్‌రెడ్డితో బలంగా తలపడ్డారు. అయితే సుధీర్‌పై ఐదేళ్లుగా ఉన్న అవినీతి ఆరోపణలను ప్రత్యర్థులు ప్రచారాంశాలుగా మార్చుకోవడంతో తమకు ఇబ్బంది తప్పదని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. కాగా… నగరి నుంచి పోటీ చేసిన దివంగత ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భాను పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉందని సమాచారం. మాజీ మంత్రి చెంగారెడ్డి టీడీపీకి పనిచేయడంతో భాను గెలుపు అవకాశాలు ఉన్నాయని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. కడప జిల్లా రైల్వేకోడూర్ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ ఎదురీదినట్లు సమాచారం. మొత్తానికి వారసుల్లో ఎంతమంది గట్టెక్కుతారో అర్థంకాక వారి తల్లిదండ్రులతో పాటు టీడీపీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు.

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వారసుడు శ్రీరామ్‌కు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఇక్కడ వైసీపీ నుంచి బరిలో నిలిచిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శ్రీరామ్‌కు చెమటలు పట్టించారు. ఇక తాడిపత్ర నుంచి పోటీ చేసిన జేసీ అస్మిత్‌రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. కర్నూలులో టీజీ వెంకటేష్‌ తనయుడు టీజీ భరత్‌ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం కేఈ తనయుడు శ్యాంబాబు కూడా అష్టకష్టాలు పడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అరకు నుంచి పోటీ చేసిన మంత్రి కిడారి శ్రవణ్‌, పత్తిపాడులో వరుపుల రాజా, చీపురుపల్లిలో నాగార్జున లాంటి వారిని కూడా ప్రత్యర్థులు ముప్పు తిప్పలు పెట్టినట్లు టీడీపీ హైకమాండ్ అంచనా వేస్తోంది.

టీడీపీ తరఫున రాజకీయ వారసులు బరిలో నిలిచిన ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా టీడీపీ గట్టి పోటీని ఎదుర్కొంది. విశాఖ నుంచి పోటీ చేసిన భరత్‌కు జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. అనకాపల్లిలో ఆడారి ఆనంద్ సైతం అష్టకష్టాలు పడ్డారు. ఇక్కడ జనసేన కారణంగా ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. అలాగే రాజమండ్రిలో మురళీమోహన్‌ కోడలు రూపకు కూడా వైసీపీ అభ్యర్థి భరత్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అనంతపురం అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా వైసీపీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమలాపురంలో బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అధిష్టానం దృష్టికి వచ్చింది.

మొత్తానికి వారసుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన సీనియర్ నేతలు ఇప్పుడు ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధినేతతో కొట్లాడి మరీ టికెట్లు సాధించుకోవడంతో ఏదైనా తేడా జరిగితే తలెత్తుకోలేమన్న ఆందోళనలో ఉన్నారు.