భయం నిజమైంది.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి.. 65కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 

  • Published By: sreehari ,Published On : March 28, 2020 / 01:09 PM IST
భయం నిజమైంది.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి.. 65కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 

Updated On : March 28, 2020 / 1:09 PM IST

భయం నిజమైంది.. ఊహించినట్టుగానే తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

హైదరాబాద్ లోని పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందినవారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

కుత్బుల్లాపూర్ లో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇవాళ ఒక్క రోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. తెలంగాణలో కరోనా కేసులు 65కు చేరాయని ఈటల వెల్లడించారు.మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని ఈటల చెప్పారు. తెలంగాణలో కరోనాతో 74ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్టు ఆయన తెలిపారు. 

ఢిల్లీ నుంచి వచ్చిన వృద్ధుడు అనారోగ్యంతో గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పాతబస్తీకి చెందిన వృద్ధుడు మృతిచెందినట్టు ఈటల వెల్లడించారు. వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకిందని తేలిందని అన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తి వల్ల చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 10మందికి పైగా కరోనా బాధితులు కోలుకున్నారని ఈటల స్పష్టం చేశారు. మరో 10 మందికి కరోనా నెగటీవ్ వచ్చిందన్నారు.