Hyderabad : హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ప్రజలు జాగ్రత్తగా

Hyderabad : హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Hyderabad

Updated On : September 2, 2021 / 10:13 PM IST

Hyderabad : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరుణుడు కుమ్మేస్తున్నాడు. ఎడతెరిపి లేకుడా కురుస్తున్న వానతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీళ్లు చేరాయి. ప్రజలు జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరో గంట పాటు భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసరం అయితే 040-29555500 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, నాంపల్లి, అబిడ్స్, బాచుపల్లి, మధురానగర్, యూసుఫ్ గూడలో వర్షం కురుస్తోంది. భారీ వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం జ‌ల‌మ‌య‌మైంది. రోడ్డుపై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ముందుకి పోలేక వెనక్కి రాలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. సరిగ్గా సాయంత్రం సమయంలో వాన కురవడంతో ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. గతేడాది చేదు అనుభవాలు గుర్తు తెస్తూ ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అన్నట్లు వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని వైపులా వానలు పడుతున్నాయి. రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై గుంతలు ఎక్కడున్నాయో తెలీదు కాబట్టి ఉన్న చోటే ఆగడం మంచిదని అధికారులు అంటున్నారు. మరికొన్ని గంటలు కుండపోత వర్షం పడొచ్చని
అధికారులు తెలిపారు.

ఉప్ప‌ల్‌లోని రాజీవ్ న‌గ‌ర్ క‌మ్యూనిటీ ఏరియాలో అత్యధికంగా 31.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కాప్రాలో 24.8, స‌ఫిల్‌గూడలో 23, కూక‌ట్‌ప‌ల్లిలో 21, తిరుమ‌ల‌గిరిలో 20.8, మోతీన‌గ‌ర్‌లో 20.5, యూసుఫ్‌గూడ‌లో 20.3, బాలాజీన‌గ‌ర్‌లో 19.8, రంగారెడ్డి న‌గ‌ర్‌లో 19.5, షేక్‌పేట‌లో 19.3, మ‌ల్కాజ్‌గిరిలో 17.8, ఖైర‌తాబాద్‌లో 17.5, వెస్ట్ మారేడ్‌ప‌ల్లిలో 16.8, షాపూర్‌న‌గ‌ర్‌లో 14.0, మాదాపూర్‌లో 12.3, జ‌గ‌ద్గిరిగుట్ట‌లో 12.3, మ‌ల్లాపూర్ బ‌యోడైవ‌ర్సిటీ ఏరియాలో 12.0 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కుండపోత వాన పడుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. సిబ్బందిని రంగంలోకి దింపారు.